అచ్చులు : ఇ




సం., నా. వా., తత్స., = మన్మథుడు, ఆశ్చర్యము, కామధేనువు, ఒకానొక అక్షరము, 1). శ్రీ కృష్టునికుమారుడు. ఇ. ఈ ఐలమీఁదికునువు క్రియా విభక్తుల యొక్క ఉకారమునకాదేశముగా వచ్చునది. ఉదా- హరికిన్, కవిని, కవివి, స్త్రీవి, పైకి, చేసిరి, చేసితిని, చేసితిమి. 2). కొన్ని శబ్దములకు విభక్తి ప్రత్యములు పరమగునపుడు ఆదేశముగా వచ్చు ఔపవిభక్తికవర్ణము. (ఉదా- ఊరియందు, కాలిచేత). 3). అలుక్సమానమున చేత, తోడ, ‘వలన’ ల అంత్యమునకు ఆదేశముగా వచ్చునది. ఉదా – దొంగవలని భయము, వానితోడి వైరము, వానిచేత ప్రోవు. 4). ఇ, ఎ. వర్ణములు కూడునపుడు అనాద్యమైన ధాతూకారమునకు ఆదేశముగా నచ్చునది. ఉదా- నిగిడి, నిగిడెను. 5). ఊష్మరేఫభిన్నమును అసంయుక్తమును అగుహల్లు పరం బగునపుడు వృత్తియందు సర్వనామమగు ఈ శబ్దమునకు ఆదేశముగా వచ్చునది (ఉదా- ఇక్కడ, ఇచ్చోట). 6). ఔపవిభక్తిములగు ‘టి,తి’ వర్ణములు పరమగునపుడు ఉకారమునకు ఆదేశముగా వచ్చునది. ఉదా- అఱ్ఱు, అఱితికి, నాలుగు, నాలుగిటికి, 7). కొనుధాతు వనుప్రయుక్త మగునపుడు యాంతధాతువులకు నిత్యముగను ఇతర ధాతువులకు వికల్పముగాను వచ్చునది. ఉదా- చేసికొనెను, వండికొనెను, పండుకొనెను. 8). క్రియలపై భూతంబున వచ్చునది. ఉదా- కొఱ్ఱిరి, కొట్టినవాఁడు, కొట్టినన్. అవ్య. 1). ప్రార్థనంబున మధ్యమపురుష ‘ము,డు’ వర్ణకములకు విభాషగననుప్రయుక్తమగునది. (ఉదా చేయుమి, చేయుఁడి). ఉదా- ఏఁడి, ఏరి, వేఁడి, వేరి. ప్ర.
మాట - మంతి :
1). ఓయారాది శబ్దంబులకు మతుబర్థము (కల అనునర్థము)న వచ్చునది. ఉదా- ఓయారి, కడలి. 2). కొన్ని ధాతువులపై వచ్చుకృత్ర్పత్యయము. ఉదా- చేయు+ఇ=చేయి. వ్రాయు+ఇ= వ్రాయి. త్రిమ్మరు+ఇ=త్రిమ్మరి. 3). క్త్వార్థమున వచ్చు ప్రత్యయము. ఉదా – చేయు + క్త్వా= చేసి చూచుట+క్త్వా= చూచి(దీనికి తెనుఁగున వ్యస్తప్రయోగము లేదు).


ఇంకా
అవ్య. = ఇకముందు, మఱియు, ఈపైన.

ఇంకించు
చూ. = ఇంకగొట్టు.

ఇంకువ
వి. = స్థలం, స్థానం.

ఇంగనము
సం., వి., అ., న., తత్స., = చలనము, కదలిక, కదల్చుట, ఆడించుట.
నానార్థాలు :
జ్ఞానము, ఎఱుక, ఇంగితము, అభిప్రాయము.


ఇంగము
సం., వి., అ., పుం., తత్స., = అభిప్రాయము, ఇంగితము ; విణ. తిరుగునది చరించునది, జంగమము, చరము, చరిష్ణువు, త్రసము, చరాచరము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇంగ్యతే జ్ఞాయతే అభిప్రాయోనేనేతి ఇంగః. దీని చేతనభిప్రాయమెరుగబడును, ఇంగతీతింగం.

నానార్థాలు :
ఆశ్చర్యము, తెలివి, గుర్తు, అచ్చెరువైనది, ఆకారము, అద్భుతము.


ఇంగాలము
సం., వి., అ., పుం., తత్స., = అంగారము, బొగ్గు.

ఇంగి(డ)లము
సం., నా. వా., అ., పుం., తత్స., = అగ్ని, నిప్పు, బొగ్గు.

ఇంగితజ్ఞానము
వి. = లోకజ్ఞానం, ఔచిత్యజ్ఞానం, వ్యవహారజ్ఞానం.

ఇంగితజ్ఞుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పరాభిప్రాయమును గ్రహించువాడు (గ్రహించునది).

ఇంగితము
సం., వి., అ., న., తత్స., = అభిప్రాయము, చలనము, కదలిక, చిహ్నము, సూచన, బొమముడిలోనగు వికారము, హృదయమునందలి భావమును తెలిపెడి చేష్టావిశేషము, ఆకారము, ఇంగము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంగ్యతే జ్ఞాయతే అభిప్రాయోనేనేతి ఇంగః, ఇంగితం చ. దీనిచేత అభిప్రాయమెరుఁగఁబడును.


ఇంగుదము
సం., విణ., (అ. ఈ. అ).,తత్స., = గారచెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంగత్యూర్థ్వం గచ్ఛతీతి ఇంగుది, ఉర్ధ్వముగా పోవునది. ఇంగుః రోగస్తమ్ ద్యతి దోక.


ఇంగుది
సం., వి., ఈ., స్త్రీ ., తత్స., = గారచెట్టు, తాపసతరువు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంగత్యూర్థ్వం గచ్ఛతీతి ఇంగుది, ఉర్ధ్వముగా పోవునది.


ఇంగ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కదలింపతగినది.

ఇంచు
వి. = కొంచెం, అల్పం, చెరకు, వలపు ; క్రి. కోరు, ఇష్టపడు, ఒప్పు, రుచించు, ఇంపవు, మించు, అతిశయించు.

ఇంటాయన
వి. = భర్త, మొగుడు, ఇంటియజమాని.

ఇంటావిడ
వి.= ఇల్లాలు, భార్య, గృహిణి, ఇంటియజమానురాలు.

ఇంటిగుట్టు
వి. = కుటుంబరహస్యం.

ఇంటిదొంగ
వి. = తన ఇంట్లోనే దొంగతనం చేసేవాడు.

ఇంటిపేరు
వి. = వంశంపేరు, (గుర్తింపు కోసం వ్యక్తిపేరుకు ముందు పెట్టుకొనే వంశం పేరు)

ఇండుపగింజు
వి. =చిల్లగింజ.

ఇంతలింతలు
వి. = చిన్న చిన్న ముక్కలు.

ఇందంబరము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = నీలోత్పలము.

ఇందద్రువు
సం., వి., ఉ., పుం., తత్స., = ఏఱుమద్ది, అర్జునము, నదీసర్జము, వీరతరువు, కకుభము, కుటజము, కొండమల్లె.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య ప్రియోద్రుః ఇంద్రద్రుః. అర్జున నామకమవుటచేత ఇంద్రునికి ప్రియమైన వృక్షము.


ఇంది
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఇందిర, రమ, లక్ష్మి.

ఇందిందిరము
సం., వి., అ., పుం., తత్స., = భ్రమరము, పద్మము, సంపదతో కూడినది, తుమ్మెద.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇందతి ఇందిరయా ఇందిందరః. 2. ఇందిం కమలశోభాం దృణాతీతి .

పర్యాయపదాలు :
మధువ్రతము, మధుకరము, మధులిట్టు, మధుపము, అళి, ద్విరేఫము, పుష్పలిట్టు, భృంగము, షట్పదము, పుష్పములను అలంకరించునది, చంచరీకము, రోలంబము, బంభరము.


ఇందిర
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= లక్ష్మి, రమ, శోభ, కాంతి.
వ్యుత్పత్త్యర్థము :
ఇందతీతి ఇందిరా. సంపదతో కూడినది, పరమైశ్వర్యయుక్తురాలు.

పర్యాయపదాలు :
పద్మాలయ, పద్మ, కమల, శ్రీః , హరిప్రియ, లోకమాత, మా, మంగళదేవత, భార్గవి, లోకజనని, క్షీరసాగరకన్యక.


ఇందిరామందిరము
సం., వి., అ., న., తత్స., = పద్మము, లక్ష్మికి మందిరము వంటివాడు (విష్ణువు).

ఇందిరాలయము
సం., వి., అ., పుం., తత్స., = పద్మము, నీలోత్పలము.

ఇందీవరము
సం., వి., అ., న., తత్స., = నల్ల కలువ, నీలోత్పలము, నీలాంబుజన్మము, తామర.
వ్యుత్పత్త్యర్థము :
ఇందతీతి ఇందీర్లక్ష్మీః, తయా వ్రియత ఇతి ఇందీవరం. లక్ష్మి చేత వరింపఁబడినది,


ఇందీవరి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పిల్లపీచఁర, నల్ల కలువల తీగ(వృ.వి), పిల్లితేగ.
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పలాభపత్రత్వాదిందీవరీ. నల్లకలువ వంటి పువ్వులుకలది.

పర్యాయపదాలు :
శతమూలి, బహుసుత, అభీరువు, వరి(వేళ్ల చేత భూమిని గప్పునది), ఋశ్యప్రోక్త, అభీరుపత్రి, నారాయణి, శతావరి, అహీరువు.


ఇందీవరిణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పిల్లపీచర, పిల్లితేగ, నల్ల కలువల తీగ(వృ.వి).
వ్యుత్పత్త్యర్థము :
ఉత్పలాభపత్రత్వాదిందీవరీ. నల్లకలువ వంటి పువ్వులుకలది.


ఇందుఁడు
సం., వి., ఉ., పుం., తత్స., = చంద్రుడు, వెండి, చంద్రమ, చంద్రుని సమసంఖ్య, చందమామ.
వ్యుత్పత్త్యర్థము :
1. ఉనక్తి తుషార కణైరితి ఇందుః. మంచుకిరణములచేత తడిపెడువాడు, ఉనత్తి అమృతధారయా భువం క్లిన్నాం కరోతీతి ఇందుః. ఉనత్తి చంద్రికయా భువం క్లిన్నాం కరోతి.

పర్యాయపదాలు :
హిమాంశువు, ఓషధీపతి, చంద్రమా, ఇందుడు, కుముదబాంధవుడు, విధుడు, సుధాంశుడు, శుభ్రాంశువు, ఓషధీశుడు, నిశాపతి, అబ్జుడు, జైవాతృకుడు, సోముడు, గ్లౌః, మృగాంకుడు, కళానిధి, ద్విజరాజు, శశధరుడు, నక్షత్రేశుడు, క్షపాకరుడు.

నానార్థాలు :
ఒక వెండిఫలము, ఏకసంఖ్యాయుక్తము, ఎత్తు, కర్పూరము, ఒక చెట్టు, మృగశిరానక్షత్రము.


ఇందుకమలము
సం., వి., అ., న., తత్స., = సితోత్పలము.
వ్యుత్పత్త్యర్థము :
ఇందురివ శుభ్రం కమలమ్. చంద్రునివలె స్వచ్ఛమైన కమలము.


ఇందుకము
సం., వి., అ., పుం., తత్స., = అశ్మంతకము (వృ.వి).

ఇందుకల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చంద్రుని పదహారుకళలు.

ఇందుకలి(శి)కడ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చంద్రకళ, కేతకి, మొగలి (వృ.వి).

ఇందుకలిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చంద్రకళ, మొగళి(వృ.వి).

ఇందుకాంతము
సం., వి., అ., పుం., తత్స., = చంద్రకాంతమణి, రాత్రి, మొగలి (వృ.వి).
వ్యుత్పత్త్యర్థము :
రాత్రియందు చంద్రకాంతి వలన ప్రకాశవంతమైనది.


ఇందుక్షయము
సం., వి., అ., పుం., తత్స., = చంద్రుని క్షీణదశ, అమావాస్య.

ఇందుజనకము
సం., వి., అ., పుం., తత్స., = అత్రిమునికథ, సముద్రకథ.

ఇందుపుష్పిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కలికారిమొక్క, జాంగలి, దూలగొండి (వృ.వి).

ఇందుభము
సం., వి., అ., న., తత్స., = కర్కాటకరాశి, మృగశీర్ష నక్షత్రము.

ఇందుభృతుడు
సం., వి., త్., పుం., తత్స., = శివుడు, మహాదేవుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇందుం బిభర్తి. చంద్రుని ధరించువాడు.


ఇందుమండలము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చంద్రబింబము, మండలాకారము.

ఇందుమణి
సం., వి., ఇ., పుం., తత్స., = చంద్రకాంతమణి, ముత్తెము.

ఇందుమతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = అజమహారాజు భార్య, పున్నమి.

ఇందుమౌళి
సం., వి., ఇ., పుం., తత్స., = శివుడు, నెలతాల్పు.

ఇందులేఖ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చంద్రకళ, సొమలత.

ఇందులోకము
సం., వి., అ., పుం., తత్స., = చంద్రలోకము.

ఇందులౌహము
సం., వి., అ., న., తత్స., = వెండి.

ఇందువదన
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చంద్రముఖి, స్త్రీ, వర్ణవృత్తభేదము.

ఇందువల్లి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = సోమలత, ఇల్లింది.

ఇందువు
సం., వి., ఉ., పుం., తత్స., = చిల్లచెట్టు, చంద్రుడు.
నానార్థాలు :
ఇంద్రుడు, మృగశిరానక్షత్రం, ఒకటి అను సంఖ్యా, హారతి కర్పూరం, పలమెత్తు వెండి (ఒకకాసువెండి) పరమేశ్వరుడు, ఆదిత్యుడు, కుటజవృక్షము, జేష్టానక్షత్రమందు విష్కంభముల యోగముల యోగములు, పూర్వదిక్పాలుడు, ఐశ్వర్యము, నృపుడు.


ఇందువ్రతము
సం., వి., అ., న., తత్స., = చాంద్రాయణవ్రతము, (చంద్రకళల యొక్క క్షయవృద్దులను అనుసరించి దినమునకు ఒకొక్కబలము చొప్పున తగ్గించుయు హెచ్చించియూ భుజించుచూ చేయు ఒకానొక వ్రతము.)

ఇందుశేఖరుడు
సం., వి., అ., పుం., తత్స., = మహాదేవుడు
వ్యుత్పత్త్యర్థము :
ఇందుః శేఖరే యస్య. చంద్రుని ధరించినవాడు.


ఇందూరము
సం., వి., అ., పుం., తత్స., = ఎలుక.

ఇంద్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కాల్పతగినది.

ఇంద్ర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మరువము, రాజని, శచీదేవి, పెదపాపర (వృ.వి); అ. పుం. ము. ఒక గ్రహయోగము.

ఇంద్రకము
సం., వి., అ., న., తత్స.,= సభా గృహము, సభాభవనము అంకుడు చెట్టు.

ఇంద్రకీలము
సం., వి., అ., పుం., తత్స.,= మందర పర్వతము, అర్జునుడు తపస్సు చేసిన ఒకానొక పర్వతము.

ఇంద్రకుంజరము
సం., వి., అ., పుం., తత్స., = ఐరావతము.

ఇంద్రకూటము
సం., వి., అ., పుం., తత్స., = ఒకానొక పర్వతము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్ర ఐశ్వర్యాన్వితః కూటోఽస్య. ఇంద్రైశ్వర్యము శిఖరము వలే రాశిగా కలిగినది.


ఇంద్రకృష్టము
సం., వి., అ., న., తత్స.,= ధాన్యము, మనుష్య ప్రయత్నము లేకయే వర్షజలము సమృద్ధముగా ఉండుటచే పండునది.

ఇంద్రకోశము
సం., వి., అ., పుం., తత్స., = మంచె, నాగదంతము, అటక, గోడకు కొట్టుపాగా కొయ్య, ఇంటి ముంజారు, ఇంటిచూరు.

ఇంద్రగణాలు
వి. బహు., = న-గల, నగ-సల-భ-ర-తలు.

ఇంద్రగిరి
సం., వి., ఇ., పుం., తత్స., = మహేంద్రపర్వతము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రనామా గిరిః. ఇంద్రపర్వతము.


ఇంద్రగురువు
సం., వి., ఉ., పుం., తత్స., = బృహస్పతి.

ఇంద్రగోపము
సం., వి., అ., పుం., తత్స., = ఆరుద్ర పురుగు.

ఇంద్రఘోషము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రశబ్దము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్ర ఇతి శబ్దేన విస్పష్టం. ఇంద్ర అను శబ్దము చేత స్పష్టముగా తెలియబడుచున్నది.


ఇంద్రచందనము
సం., వి., అ., న., తత్స., = శ్వేతచందనము, హరిచందనము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రప్రియం చందనమ్, ఇంద్రునికి ప్రియమైన చందనము.


ఇంద్రచాపము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రధనస్సు, హరివిల్లు, మేఘమున చిత్రవర్ణములతో ధనురాకారముగా కనపడు సూర్యకిరణ సముదాయము.

ఇంద్రచిర్భిటి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒక లత.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్యాత్మనః ప్రియా చిర్భటీ సా. ఇంద్రుని యొక్క ఆత్మకు సేవకురాలు వంటిది.


ఇంద్రచ్ఛందస్సు
సం., వి., స్., న., తత్స., = ఒకముత్యాలహారము, వేయిపేటలు కల హారము.

ఇంద్రజననము
సం., వి., అ., న., తత్స., = ఆత్మదేహ సంబంధభేదము, గ్రంథభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య ఆత్మనః, జననం దేహసంబంధభేదః , ఆత్మకు శరీరమునకి మధ్య పుట్టుక వలన ఏర్పడిన సంబంధము ఆ సంబంధమును గూర్చి గ్రంధమునకు పేరు. ఆత్మనోదేహసంబంధభేదే. తదధికృత్య కృతః గ్రంథే చ.


ఇంద్రజాలము
సం., వి., అ., పుం., తత్స., = మాయ, కనికట్టు విద్య, మంత్ర జౌషధాదులచేత ఒక విధమగు పదార్థమును మరియొక విధముగా చూపెడి విద్య, కనుబ్రాముట, గారడి, మోసపుచ్చుట.

ఇంద్రజాలికుఁడు
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రజాలము చేయువాఁడు.

ఇంద్రజిత్తు
సం., వి., త్., పుం., తత్స., = ఇంద్రుని జయించినవాడు, మేఘనాదుడు, రావణపుత్రుడు.


ఇంద్రజిద్ధంత
సం., వి., ఋ., పుం., తత్స., = లక్ష్మణుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రజితం హంతి ధశరథాత్మజుడు. ఇంద్రజిత్తుని చంపినవాడు, దశరథుని పుత్రుడు లక్ష్మణుడు.


ఇంద్రతాపనుడు
సం., వి., అ., పుం., తత్స., = ఒక రాక్షసుడు, మేఘనాథుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రం తాపయతి. ఇంద్రుని తపింపచేయు ఒక అసురుడు.


ఇంద్రతూలము
సం., వి., అ., న., తత్స., = దూదిప్రోగు
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్యేవ తూలమ్ ఆకాశే ఉడ్డీయమానత్వాత్. గాలికి ఆకాశమున ఎగురుచున్న దూదికణం.


ఇంద్రతోయ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గంథమాదన సమీపములో ఉన్న ఒక నది.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రమైశ్వర్యాన్వితం తోయమస్యాః. ఐశ్వర్యంతో కూడిన జలము.


ఇంద్రదమనుడు
సం., వి., అ., పుం., తత్స., = బాణాసురపుత్రుడు.

ఇంద్రదారువు
సం., వి., ఉ., పుం., తత్స., = దేవదారు వృక్షము.

ఇంద్రద్యుమ్నుడు
సం., వి., అ., పుం., తత్స., = ఒక ఋషి, అసురావతార రాజు భేదము, ఒక రాజు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్యేవ ద్యుమ్నం ధనమస్య. ఇంద్రుని వలే ఐశ్వర్యము కలవాడు.


ఇంద్రద్రుమము
సం., వి., అ., న., తత్స., = అర్జున వృక్షము(వృ.వి), మద్దిచెట్టు.

ఇంద్రధనుస్సు
సం., వి., స్., న., తత్స., = ఇంద్రచాపము, హరివిల్లు, ఆకాశంలో ఏడురంగులతో విల్లు మాదిరిగా కనిపించే రూపం.

ఇంద్రధ్వజము
సం., వి., అ., పుం., తత్స., = భాద్రపదశుక్ల ద్వాదశియందు రాజు తన రాజ్యమందు సస్యవృద్ధికరమగు వానకురియుటకై ఇంద్రప్రీతిగానెత్తునట్టి ధ్వజ విశేషము.

ఇంద్రనక్షత్రము
సం., వి., అ., న., తత్స., = జ్యేష్ఠానక్షత్రము, ఫల్గునీనక్షత్రము.

ఇంద్రనీలము
సం., వి., అ., పుం., తత్స., = నీలమణి, వస్త్రవిశేషము, నల్లఱాయి, ఒకమాణిక్యము.

ఇంద్రనేత్రము
సం., వి., అ., న., తత్స., = ఇంద్రుని నేత్రము, వేయిసంఖ్య.

ఇంద్రపత్ని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = శచీదేవి, పులోమజ.

ఇంద్రపర్ణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఓషథి భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్ర ఇవ నీలం పర్ణమస్యాః , ఇంద్రమణి లేదా మరకతము వలె నలుపుతో కూడిన పచ్చని ఆకులు కలది.


ఇంద్రపర్వతము
సం., వి., అ., పుం., తత్స., = మహేంద్రపర్వతము, ఇంద్రవర్ణపర్వతము, నీలవర్ణపర్వతము, గిరిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రనామకః పర్వతః. ఇంద్ర అను పేరు గల పర్వతము.


ఇంద్రపురోహితుడు
సం., వి., అ., పుం., తత్స., = బృహస్పతి.

ఇంద్రపుష్పి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = దూలగొండి (వృ.వి).

ఇంద్రప్రస్థము
సం., వి., అ., న., తత్స., = యమునా తీరముననున్న ఒకానొక పట్టణము.

ఇంద్రప్రహరణము
సం., వి., అ., న., తత్స., = ఇంద్రుని అస్త్రము, వజ్రాయుధము.

ఇంద్రభూతి
సం., వి., ఇ., పుం., తత్స., = హేమచంద్రుడు చెప్పిన గౌతమగోత్రము.

ఇంద్రభేషజము
సం., వి., అ., న., తత్స., = శొంఠి.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రేణ ప్రకాశితం భేషజమ్. ఇంద్రుని చేత ఆవిష్కరింపబడిన ఔషధము.


ఇంద్రభోగము
వి., = మహావైభవము.

ఇంద్రమహ
సం., వి., అ., పుం., తత్స., = కుక్క

ఇంద్రము
సం., వి., అ., పుం., తత్స., = కుటజము (వృ.వి), అధిపతి, శ్రేష్ఠము, భారతవర్షమునందలి ఒకానొక ఉపద్వీపము.

ఇంద్రయవము
సం., వి., అ., న., తత్స., = కొడిసెకాయ, ఒక ధాన్యము, కొండమల్లెవిత్తు, కళింగము, భద్రయవము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రవృక్ష ఫలత్వాద్యవభీజాకృతిత్వాచ్చ ఇంద్రయవం ఇంద్రమనగా కొడిశెచెట్టు, దాని ఫలములు యవలవలెనుండును.


ఇంద్రలాజి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒక ఔషధము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య కుటజస్య లాజా ఇవ లాజా యస్యాః. ఇంద్రకుటజము యొక్క లాజములు వంటి లాజములు కలిగినది.


ఇంద్రలుప్తకము
సం., వి., అ., న., తత్స., = బట్టతల.

ఇంద్రలుప్తకుఁడు
సం., విణ.,(అ. ఈ. అ)., తత్స., = బట్టతలవాఁడు.

ఇంద్రలుప్తము
సం., వి., అ., న., తత్స., = ఒకానొకరోగము, బట్టతల, కేశనాశకరోగము, ఇంద్రలుప్తకము, కేశఘ్నము, కేశరోగవిశేషము.

ఇంద్రలోకము
సం., వి., అ., పుం., తత్స., = స్వర్గము.

ఇంద్రవంశ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒకానొకవృత్తము. (ఇందు ప్రతిపాదమునకు పండ్రెండు అక్షరములుండును).

ఇంద్రవజ్ర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒకానొకవృత్తము, (ఇందు ప్రతిపాదమునకు పదకొండు అక్షరములుండును).

ఇంద్రవల్లి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఇల్లింద, ఇంద్రవారుణీ లత, పెద్దపాపర (వృ.వి). పారిజాలత, పారిభద్రము (వృ.వి).

ఇంద్రవస్తి
సం., వి., ఇ., పుం., తత్స., = కాలిపిక్క, చీలమండ.

ఇంద్రవారుణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = పెద్దపాఁపర, పెద్దచీర, విశాల(పెద్ద పండ్లు గలది).
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రవన్నేత్రాభైః పుష్పైః వ్రియత ఇతి ఇంద్రవారుణీ. ఇంద్రుని వలె నేత్రసమానములైన పుష్పముల చేతఁకప్పబడునది.


ఇంద్రవీజము
సం., వి., అ., న., తత్స., = ఇంద్రయవము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య కుటజస్య బీజమ్. ఇంద్రకుటజము యొక్క బీజము.


ఇంద్రవృక్షము
సం., వి., అ., పుం., తత్స., = దేవదారు వృక్షము.

ఇంద్రవృద్ధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = సుశ్రుతలో చెప్పబడిన ఒక క్షుద్రరోగము.

ఇంద్రవ్రతము
సం., వి., అ., న., తత్స., = చాంద్రాయణవ్రతము, చంద్రకళల యొక్క క్షయ వృద్ధులననుసరించి దినమునకు ఒక్కొక్క కళను చొప్పున తగ్గించి హెచ్చించి భాజించుచూ చేయు ఒకానొక వ్రతము.

ఇంద్రశత్రువు
సం., వి., ఉ., పుం., తత్స., = ఇంద్రుని శత్రువు. (వృత్రాసురుడు.)

ఇంద్రశలభము
సం., వి., అ., పుం., తత్స., = ఆరుద్రపురుగు.

ఇంద్రసారథి
సం., వి., ఇ., పుం., తత్స., = ఇంద్రుని యొక్కసారథి.

ఇంద్రసావర్ణి
సం., వి., ఇ., పుం., తత్స.,= పదునాల్గవ మనువు.

ఇంద్రసుతుడు
సం., వి., అ., పుం., తత్స., = జయంతుడు, పార్థుడు, అర్జునవృక్షము, వాలి, వానర యోధుడు.

ఇంద్రసుర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = పెద్దపాపర (వృ. వి).
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య ఆత్మనః సురేవ ప్రియా. ఎవరికి వారికి సురవలె ప్రియమైనది.


ఇంద్రసురసము
సం., వి., అ., పుం., తత్స., = వావిలి(వృ.వి), సిందుకము, సిందువార ; స్త్రీ. నిర్గుండి, ఇంద్రాణిక.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య సురసః ప్రియః ఇంద్రసురసః. ఇంద్రునికి ప్రియమైనది.


ఇంద్రసూక్తము
సం., వి., అ., న., తత్స., = ఇంద్రసూక్తము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రదేవతాకం సూక్తమ్. ఇంద్ర దేవతా ప్రధానమైన సూక్తము.


ఇంద్రసేన
సం., వి., అ., పుం., తత్స., = రాజు, పుత్రుడు, యుధిష్టిరభృత్యుడు, ఇంద్రునిసేనయందు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య సేనా ఇవ సేనా యస్య. ఇంద్రుని యొక్క సేన వలె సేన ఎవరికో వారు.


ఇంద్రస్తుతము
సం., వి., త్., పుం., తత్స., = ఇంద్రస్తుతి.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రః స్తూయతేఽత్ర. ఇంద్రుడు దీనిచేత స్తుతింపబడుచున్నాడు.


ఇంద్రస్తోమము
సం., వి., అ., పుం., తత్స., = అతి రాత్రియాగమందు భేదము.

ఇంద్రహూ
సం., వి., ఊ., స్త్రీ., తత్స., = శక్రాహ్వానభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రః హూయతేఽనయా. ఇంద్రుడు దీనిచేత హవనము చేయబడతాడు.


ఇంద్రాగ్ని
సం., వి., ఇ., పుం., తత్స., = విద్యుదగ్ని, మేఘముల వలన కలుగు నిప్పు, మెఱపు.

ఇంద్రాణి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = శచీదేవి, దుర్గాభేదము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇంద్రస్య పత్నీ ఇంద్రాణీ. ఇంద్రుని భార్య 2.ఇంద్రస్య ఐశ్వర్యశాలినః సురరాజస్య వా పత్నీ ఇంద్రాణీ. ఐశ్వర్యసంపన్నుడైన దేవతలరాజు ఇంద్రుని యొక్క భార్య.

పర్యాయపదాలు :
ఒకమాతృక, పులోమజ, శచి, పౌలోమి, మాహేంద్రి, పూతత్రతాయి, జయవాహిని, సప్తమాతలలో ఒకతి, ఇంద్రశక్తి, ఐంద్రి.

నానార్థాలు :
శతవారి, ఇంద్రసురిసవృక్షము, నీలసిందువారవృక్షము, స్త్రీల కరణం, స్థూలైల, సూక్ష్మైల, శివా, వావిలి, పెద్ద ఏలకి (వృ.వి), నల్లవావిలి (వృ.వి).


ఇంద్రాణిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స.,= వావిలి చెట్టు, నిర్గుండి ; పుం. సిందుకము, సిందువార, ఇంద్రసురసము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య ప్రియా ఇంద్రాణిక. ఇంద్రునికిఁప్రియమైనది.


ఇంద్రానుజుడు
సం., వి., అ., పుం., తత్స., = వామనుడు, నారాయణుడు.

ఇంద్రాభుడు
సం., వి., అ., పుం., తత్స., = దృతరాష్ట్రుని పుత్రుడు.

ఇంద్రాయుధము
సం., వి., అ., న., తత్స., = రతనపు విల్లు, ఇంద్రధనుస్సు, శక్రధనుస్సు, మేఘములందు నానావర్ణమై ప్రతిఫలించు ధనురాకారముగాకనబడెడి సూర్య కిరణము, ఒకజాతి జలగ(దీని శరీరముపై ఇంద్రధనుస్సువంటి రంగులు ఉండును). ; పుం. నల్లకన్నుల గుర్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం. ఇంద్రుని ఆయుధము.


ఇంద్రారి
సం., వి., ఇ., పుం., తత్స., = అసురుడు, వేల్పుదాయ.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్యారయః ఇంద్రారయః. ఇంద్రునికి శత్రువులు.

పర్యాయపదాలు :
దైత్యుడు, దైతేయుడు, దనుజుడు, దానవుడు, శుక్రశిష్యుడు, దితిసుతుడు, పూర్వదేవుడు, సురద్విషుడు.


ఇంద్రాలిశము
సం., వి., అ., పుం., తత్స., = కీటకభేదము.

ఇంద్రావరజుఁడు
సం., వి., అ., పుం., తత్స., = వామనుడు, ఉపేంద్రుడు, చక్రపాణి, చతుర్భుజుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రస్య అవరజః ఇంద్రావరజః. ఇంద్రునికి తమ్ముడు విష్ణువు (ఇతడు వామనావతారమున ఇంద్రునితమ్ముడయ్యెను).

పర్యాయపదాలు :
విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, వైకుంఠుడు, విష్టరశ్రవుడు, దామోదరుడు, హృషీకేశుడు, కేశవుడు, మాధవుడు, స్వభుడు, దైత్యారి, పుండరీకాక్షుడు, గోవిందుడు, గరుడధ్వజుడు, పీతాంబరుడు, అచ్యుతుడు, శాంర్గి, విష్వక్సేనుడు, జనార్దనుడు, పద్మనాభుడు, మధురిపుడు, వాసుదేవుడు, త్రివిక్రముడు, దేవకీనందనుడు, శౌరి, శ్రీపతి, పురుషోత్తముడు, వనమాలి, బలిధ్వంసి, కంసారాతి, రథోక్షజుడు, విశ్వంభరుడు, కైటభజితుడు, విధుడు, శ్రీవత్సలాంచనుడు, గదాగ్రజుడు, ముంజకేశుడు, దాశార్హుడు, దశ రూపములు పొందినవాడు.


ఇంద్రావసానము
సం., వి., అ., పుం., తత్స., = గంజాయి (వృ.వి), గురువింద.

ఇంద్రాశనము
సం., వి., అ., పుం., తత్స., = భంగ, గంజాయి (వృ.వి), గురివెంద(వృ.వి), గుంజాలత.

ఇంద్రాసనము
సం., వి., అ., పుం., తత్స., = సంవిదారవృక్షము, ప్రథమభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్ర ఆత్మా అస్యతే నిక్షిప్యతేఽనేన. ఆత్మ దీనిచేత ఉంచబడుతున్నది కాబట్టి.


ఇంద్రియగోచరము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రియములకు గోచరించునది (ఇంద్రియాలకు తెలిసే శబ్ద, స్పర్శ, రూపాదికము).

ఇంద్రియగ్రామము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రియసముదాయము, ఇంద్రియసమూహము, ఇంద్రియవర్గము.

ఇంద్రియజము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రత్యక్షము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియాజ్జాయతే. ఇంద్రియసన్నికర్షజాతే ప్రత్యక్షే. ఇంద్రియముల నుండి పుట్టినది.


ఇంద్రియజ్ఞానము
సం., వి., అ., న., తత్స., = ప్రత్యక్షజ్ఞానము.

ఇంద్రియనిగ్రహము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రియములను విచ్చలవిడిగా విషయములందు ప్రవర్తింపనీయక వశపరచుకొనుట, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం.

ఇంద్రియబోధనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇంద్రియములకు ఉద్రేకము కలిగించునది, ఇంద్రియములను రేపుట.

ఇంద్రియము
సం., వి., అ., న., తత్స., = త్వగాది ఇవి పది త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము, ఇవి జ్ఞానేంద్రియములు, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థము, ఇవి కర్మేంద్రియములు మనస్సుతో కూడ ఏకాదశేంద్రియములగును, జ్ఞాన కర్మ సాధనం, విషయి, విషయము, హృషీకము.
వ్యుత్పత్త్యర్థము :
1. ఇంద్రస్యాత్మనోలింగమనుమాపకమ్. ఇంద్రుడనఁగా ఆత్మ, ఆత్మకు జ్ఞాపకముకనుక ఇంద్రియము. 2.ఇంద్రస్యాత్మనో లింగమనుపాకం, ఇంద్రేణ ఈశ్వరేణ సృష్టం, ఇంద్రేణ జుష్టం వా ఇంద్రియం.

నానార్థాలు :
అక్షము, కరణము, పృషీకము, గ్రహణము, వీర్యము, శుక్రము, తేజము, బీజము, రేతస్సు, విజ్ఞానము, ఇంద్రియములగుడు రేతస్సు, ఐదు అను సంఖ్య.


ఇంద్రియవంతుడు
సం., విణ., (త్. ఈ. త్.), తత్స., = వశ్యేంద్రియము కలిగినవాడు, ప్రశస్తేంద్రియము కలిగినవాడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియం వశ్యతయా ప్రాశస్త్యేన వాస్త్యస్య. ఇంద్రియము ఇతని అధీనములో గాని చాలా ప్రశస్తముగా గాని ఇతనికి ఉన్నది అనే అర్థములో.


ఇంద్రియవృత్తి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = కర్మేంద్రియాలు.
వ్యుత్పత్త్యర్థము :
శబ్దాదిషు పంచానామాలోచనమాత్రమిష్యతే వృత్తిః. శబ్దరసరూపగంధస్పర్శల విషయములో ఆలోచన మాత్రము చేతనే కోరుటకు వృత్తి అని పేరు.


ఇంద్రియసన్నికర్షము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రియములకు తమ తమ విషయముతో సంబంధము ప్రత్యక్షజనకమగు వ్యాపారము.

ఇంద్రియస్వాపము
సం., వి., అ., పుం., తత్స., = సుషుప్తి అవస్థయందు.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియాణాం స్వస్వవిషయేషు స్యాప. ఆ యా ఇంద్రియములకు వాటి వాటి విషయములపట్ల స్పృహలేకుండుటయే నిద్ర అని చెప్పబడుచున్నది.


ఇంద్రియాత్మ
సం., వి., న్., పుం., తత్స., = ఇంద్రియ స్వరూపం.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియమేవాత్మా. ఇంద్రియమే ఆత్మగా గలవాడు.


ఇంద్రియాది
సం., వి., ఇ., పుం., తత్స., = అహంకారము.

ఇంద్రియాధిష్ఠాత
సం., వి., ఋ., పుం., తత్స., = ఈశ్వరనియోజితము, దేవభేదము.

ఇంద్రియారాముడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = విషయలోలుడు, ఇంద్రియార్థములు అనుభవించుటయందు ఆసక్తికలవాడు.

ఇంద్రియార్థము
సం., వి., అ., పుం., తత్స., = శబ్దాది విషయము(ఇవి ఐదు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము), గోచరము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రియైరర్థ్యంతే అభిలష్యంత ఇతి ఇంద్రియార్థాః. ఇంద్రియములచేత అభిలషింపపడునది.


ఇంద్రియేశుడు
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రియములకు అధిపతి.

ఇంద్రుడు
సం., వి., అ., పుం., తత్స., = వేల్పురేడు, ఆత్మ, సూర్యుడు, ప్రభువు.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇందతీతింద్రః. పరమైశ్వర్యయుక్తుఁడు,

పర్యాయపదాలు :
వేల్పురేడు, ఒక ఆదిత్యుడు, అంతరాత్మ, అష్టదిక్పాలకులలో ఒకడు, దేవరాజు, అదితిపుత్రుడు, పూర్వదిక్పతి, మరుత్వంతుడు, పాకశాసనుడు, మఘవుడు, బిడౌజుడు, వృద్ధశ్రవుడు, సునాసీరుడు, పురూహూతుడు, పురందరుడు, జిష్ణువు, లేఖర్షభుడు, శతమన్యువు, శక్రుడు, దివస్పతి, సుత్రాముడు, గోత్రభిత్తు, వజ్రి, వాసవుడు, వృత్రహుడు, వృష, వాస్తోస్పతి, సురపతి, బలారాతుడు, జంభభేది, హరిహయుడు, స్వరాట్టు, నముచిసూదనుడు, సంక్రందనుడు, సహస్రాక్షుడు, మేఘవాహనుడు, వజ్రపాణి, దేవతాధిపుడు, శచీపతి, దుశ్చ్యవనుడు, తురాషాట్టు, ఆఖండులుడు, ఋభుక్షుడు, మహేంద్రుడు, కౌశికుడు, పూతక్రతువు, విశ్వంభరుడు, హరి, పురుదంశుడు, పృతనాషాట్టు, శతధృతి, అహిద్విషుడు, పర్వతారి, పర్యన్యుడు, నాకనాథుడు, పులోమారి, అర్హుడు, ప్రాచీనబర్హి, తపస్తక్షుడు, దేవతలకు రాజు, శచీదేవిభర్త.

నానార్థాలు :
ఒక గ్రహయోగము, కుటజవృక్షము, రాత్రి, ఉపద్వీపవిశేషము, రాజు, పరమేశ్వరుడు, మరువము, ఇంద్రియము, శ్రేష్ఠము, ప్రథమము, గుగ్గిలపుచెట్టు, విషము.


ఇంద్రుతూలకము
సం., వి., అ., న., తత్స., = గాలికి ఆకాశమున ఎగురుచున్న దూదికణము.

ఇంద్రేజ్యుడు
సం., వి., అ., పుం., తత్స., = బృహస్పతి.

ఇంద్రేశ్వరుడు
సం., వి., అ., పుం., తత్స., = మహేంద్ర పర్వతమందు వృత్తాసురవథవలన కలుగు బ్రహ్మహత్యాపాతకం పోవుటకై ఇంద్రునిచేత స్థాపించబడిన శివలింగ భేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంద్రేణ స్థాపితః ఈశ్వరః ఈశ్వరలింగమ్. ఇంద్రుని చేత స్థాపించబడిన శివలింగము.


ఇంద్రోత్సవము
సం., వి., అ., పుం., తత్స., = ఇంద్రుని గూర్చి రాజులు మొదలగువారు చేయు ఉత్సవ విశేషము.

ఇంధకుడు
సం., విణ., (అ. ఆ. అ)., పుం., తత్స., = కాల్చెడు, కాల్చునది, అంధక.

ఇంధనము
సం., వి., అ., న., తత్స., = రగుల్చునది, వెలిగించునది.
వ్యుత్పత్త్యర్థము :
ఇంధేరగ్నిననేన ఇంధనం. ఇధ్యతేఽనేన. దీనిచేత ప్రజ్వరిల్లబడుతున్నది.

పర్యాయపదాలు :
వంట చెఱకు, ఇధ్మము, ఏధస్సు, సమింధనము, చిదుగు ; స్త్రీ. సమిధ ; పుం. అగ్నిసందీపనతృణకాష్టము, ఏధము.


ఇంధన్వము
సం., విణ., (న్. ఈ. న్)., తత్స., = ఇంధనయుక్తము.

ఇంధయిత
సం., విణ., (ఋ. ఈ. ఋ)., తత్స., = కాల్చువాడు, కాల్చునది.

ఇంధయితవ్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కాల్చబడవలసినవాడు, కాల్చబడవలసినది.

ఇంధిత
సం., విణ., (ఋ. ఈ. ఋ)., తత్స., = కాలునది (కట్టియ).

ఇంపారు
అ. క్రి =ఆనందించు, సంతోషించు.

ఇంపుసొంపారు
అ. క్రి = మిక్కిలి శోభించు.

ఇక
అవ్య. = తరువాత, ఈ మీదట, ఇంతకన్నా, దీనితో, ఇంతవరకు, ఈ పైకి, ఇప్పటి నుంచి రూ. ఇంక, ఇంకా.

ఇకటము
సం., వి., అ., పుం., తత్స., = శరీరము, వెదురు, మొలక, చాప అల్లుటకు ఉపయోగించు తృణ విశేషము.
వ్యుత్పత్త్యర్థము :
ఏతి భూమిసుద్భిద్య గచ్ఛతి.


ఇకిలించు
అ. క్రి. = వెకిలిగా నవ్వు, పళ్ళు కనపడేట్లు నోరు తెరిచిన నవ్వు, ఇగిలించు.

ఇకిలింత
వి. = వెకిలినవ్వు.

ఇక్షుకము
వి. = చెరకు.

ఇక్షుకాండము
సం., వి., అ., పుం., తత్స., = ఱెల్లుకాశము (వృ.వి), ముంజిగడ్డి, చెఱకుగడ.

ఇక్షుకుట్టకుడు
సం., వి., అ., పుం., తత్స., = చెఱకునరికి బెల్లముచేయువాడు, కృషీవలభేదము.

ఇక్షుగంధ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = బెల్లం, గొలిమిడి, తెల్ల నేలగుమ్మడి, విదారి, క్షీరశుక్ల, క్రోష్టి, పల్లేరు, ఱెల్లు ; పుం. కాండేక్షువు, కోకిలాక్షము, ఇక్షురము, క్షురము.
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షోర్గంధ ఇవ గంధోఽస్యాః. చెరకునుండి పుట్టినది.

పర్యాయపదాలు :
పలంకష, శ్వదంష్ట్రము, స్వాదుకంటకము, గోకంటకము, గోక్షురకము, వనశృంగాటము.


ఇక్షుగంధుడు
సం., వి., అ., పుం., తత్స., = పల్లేరు
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షోర్గంధ ఇవ గంధోస్యా ఇక్షుగంధా. చెరకువంటిగంధముకలది.

నానార్థాలు :
గొలిమిడి, తెల్ల నేలగుమ్మడి, రెల్లు (వృ.వి), క్షుద్ర గోక్షురము.


ఇక్షుచ్ఛాయము
సం., వి., అ., న., తత్స., = చెరకులనీడ.

ఇక్షుజము
సం., విణ ., (అ. ఆ. అ)., తత్స., = బెల్లము.
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షోస్తద్రసాజ్జాయతే. చెరుకు రసమునుండి తయారైనది.


ఇక్షుద
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చెరకు రసముతో సమానమైన నదీజలము.
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షుమ్ ఇక్షురసాస్వాదం దదాతి జలేన. చెరకు రసముతో సమానమైన రసాస్వాదము అందించు జలము.


ఇక్షుదర్భ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒక విధమగు గడ్డి.

ఇక్షుధన్వుడు
సం., వి., న్., పుం., తత్స., = ఇంచువిలుకాడు, మన్మథుడు, ఇంచువిల్తుఁడు.

ఇక్షునాళిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నల్లచెఱకు(వృ.వి).

ఇక్షునేత్రము
సం., వి., అ., న., తత్స., = చెఱకుగనుపు, ఒకజాతి చెఱకు.

ఇక్షుపత్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = ధాన్యభేదము.

ఇక్షుపాకము
సం., నా. వా., అ., పుం., తత్స., = పాకము పట్టిన చెఱకురసము.

ఇక్షుప్రము
సం., నా. వా., అ., పుం., తత్స., = శరము, ఱెల్లు (వృ.వి).

ఇక్షుబాలిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = శరము, ఱెల్లు (వృ.వి).

ఇక్షుమేహము
సం., నా. వా., అ., పుం., తత్స., = చక్కెరవ్యాధి, మధుమేహమను రోగము.

ఇక్షుయంత్రము
సం., నా. వా., అ., న., తత్స.,= చెఱకుగానుగ, చెఱకురసము తీయుయంత్రము.

ఇక్షుయోని
సం., నా. వా., ఇ., పుం., తత్స., = నలుపు కలిసిన ఎఱ్ఱ చెఱకు.

ఇక్షురకము
సం., వి., అ., న., తత్స., = ఱెల్లుగడ్డి (వృ.వి), చెఱకు.

ఇక్షురము
సం., వి., అ., పుం., తత్స., = గొలిమిడి, ములుగొలిమిడి, రసాలము, ఇక్షుగంధ, కాండేక్షువు, కోకిలాక్షము, క్షురము.
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షుం రాతి సాదృశ్యాత్ ఇక్షురః. సాదృశ్యము చేత చెరకును పుచ్చుకొనునది.


ఇక్షువనము
సం., నా. వా., అ., న., తత్స., = చెఱకుతోఁట.

ఇక్షువల్లి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = నల్లనేలగుమ్ముడు.

ఇక్షువాటి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స., = చెఱుకుతోట, పుండ్రికమను చెరకు (వృ.వి).

ఇక్షువాలిక
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = కాశము, ఱెల్లు(వృ.వి).

ఇక్షువికారము
సం., నా. వా., అ., పుం., తత్స., = బెల్లము, గుడము.

ఇక్షువు
సం., వి., ఉ., పుం., తత్స., = ఇంచు, రసాలము, చెఱకు (వృ.వి), దీనిభేదములు (పుండ్రము, కాంతారము, శతపర్వము, బంగాళము, నేపాళము మొదలగునవి.)
వ్యుత్పత్త్యర్థము :
ఇష్యతే సర్వైరితి ఇక్షుః. అందరి చేత కోరఁబడునది.


ఇక్షుశరము
సం., నా. వా., అ., పుం., తత్స., = కాశభేదము, ఒకజాతి రెల్లు.

ఇక్షుశాకటము
సం., వి., అ., న.., తత్స., = చెఱకుపండెడు పొలము, కాశభేదము, ఒకజాతిరెల్లు, చెరకుపొలము.

ఇక్షుసారుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = సూర్యవంశపురాజులలో ఒకడు, చేదుసొర.

ఇక్షూదము
సం., వి., అ., పుం., తత్స., = చెఱకు సముద్రము.

ఇక్ష్వాకువు
సం., వి., ఉ., పుం., తత్స., = సూర్యవంశములో మొదటి రాజు ; స్త్రీ. చేదుసొర, చేదగుట, కటుతుంబి, వదరుచెట్టు.
వ్యుత్పత్త్యర్థము :
ఇక్షుమప్యకయతి కుటిలయ ఆక్తత్వేన ఇక్ష్వాకుః. చెరకును కూడ చెరచునది.


ఇక్ష్వారి
సం., వి., ఇ., పుం., తత్స., = తెల్లగడ్డి, ఇక్షురివ.

ఇగటాలమాట
వి. = ఉత్తుత్తి మాట, ఎగతాళి మాట.

ఇగటించు
క్రి. = ఎదురుతిరుగు, సరిపడకపోవు.

ఇగరబెట్టు
స. క్రి. = అత్తెసరు పెట్టి ఇగుర్చు, నీళ్ళు లేదా తేమ లేకుండా చేయడం, ఇగురపెట్టు.

ఇగురాకు
వి. = చిగురాకు, లేతాకు.

ఇగురుకూర
వి. = పొడికూర, పులుసు లేని కూర.

ఇచికిలుడు
సం., వి., అ., పుం., తత్స., = కర్థముడు, జంబాలుడు.

ఇచ్చకాలమారి
వి. = ముఖప్రీతి మాటలు చెప్పే వ్యక్తి, ప్రియవాది, నయవంచకుడు.

ఇచ్చిపుచ్చుకొను
అ. క్రి = పరస్పరం వియ్యమందు, పరస్పరం సహాయం చేసుకొను, లావాదేవీలు కలిగి ఉండు.

ఇచ్ఛ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కాంక్ష, వాంఛ, ఛందము.
వ్యుత్పత్త్యర్థము :
ఇషు ఇచ్ఛాయాం, ఏషణమిచ్ఛా, ఇచ్ఛయించుట ఇచ్ఛ.

పర్యాయపదాలు :
మనోధర్మవిశేషము, ఆకాంక్ష, మనోరథము, ఇషము, ఈహ, కామము, అభిలాష, కోరిక, తృష్ణ, లిప్స, ఇష్టమైనది, ప్రియమైనది, శ్రద్ధ, ఇష్టప్రకారము పోవుట. స్పృహ, ఆకలి, దోహదము, రుక్, ఈషా, దోహలము, తృట్, తర్షము, రుచి, మతి, దోహళము, ఛందము, చిత్తము, మనస్సు.

ప్రయోగము :
సీ... నీకు నావిభవంబు కానంగ రాదు,
గుప్తమై యున్నది గుహయందు,
నాకిచ్చ పుట్టిన నప్పుడు పొలిచి తోఁచు, (భార. శార. 4. 392. )

గీ. ఇచ్ఛ యెఱిఁగినరతికేళి మెచ్చి పొగడు. (మను.చ. 3. 123.)

క. ఎచ్చోట నున్నవాఁడతఁ,
డిచ్చోటకి నేలరాఁడో ఇప్పు డనుడుఁ దా,
నచ్చట నంతర్హితుఁడై,
యిచ్చఁజనియెఁ దోఁచు నేఁటియెల్లిటిలోనన్. (భార. విరా. 2. 85.)

ఆ.. భూతకోటిమంచు వోలెఁదోఁచు,
విరియుబుద్ధిమంతులు దాని,
కిచ్చ వగవరింత యెఱుఁగ నెట్లు. (భార. శాం. 4. 392.)

అ.ఇదియసుమ్ముమాకునిచ్చలోఁగలకోర్కి,
పొసఁగ నీదువలనఁ బొందుపడియె. (భాగ. 6. 223.)

ఉ.. కడు వట్టి ప్రజ్ఞచే నిచ్చకువచ్చినట్లు,
చరియించును దుష్కవి తచ్చరిత్రమే,
యచ్చున నెన్నిచూచినను హా నగుఁబాటు గదా గణింపఁగన్. (వి ప్ర. 1.14. )

క. సన్నిధిఁ బన్నగహారుఁడు,
పెన్నిధిఁగని పొంగుచున్న పేదలక్రియ న,
య్యన్నం దమ్మునిఁగని మీ,
కెన్నఁగ నేవరములిచ్చ యిచ్చెద వానిన్. (ఉ. హరి. 4. 15. )




ఇచ్ఛాకృతము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఇష్టంవచ్చినట్లువేసిన అధర్మపువడ్డి, కామకృతము.

ఇచ్ఛావతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = కాముక, ధనాధి విషయములందు కోరికగల స్త్రీ, సంభోగము తక్క తక్కిన విషయములందు ఇచ్ఛగల స్త్రీ.
వ్యుత్పత్త్యర్థము :
పుష్పాదిషు ఇచ్ఛా అస్యా ఇతి ఇచ్ఛావతీ. పుష్పాదులయందు అభిలాష కలది.


ఇచ్ఛావసువు
సం., నా. వా., ఉ., పుం., తత్స., = కుబేరుడు.

ఇచ్ఛితము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరిక కలది.

ఇజ్జకము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరునది.

ఇజ్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = యజ్ఞము.
నానార్థాలు :
సంగమము, కూడిక, దానము, ప్రతిమ, పూజ, ఆవు, ఈవి, కుంటెనకత్తె, తార్పుకత్తె.


ఇజ్యాశీలుడు
సం., వి., అ., పుం., తత్స., = యాగశీలుడు, యాయజూకుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇజ్యా శీలమస్య.(ఇజ్యం యజ్ఞం శీలయతి పునః పునరాచరతీతి పునః పునర్యజ్ఞకర్త మాయ జూకుడు.) మరల మరల యజ్ఞము చేయువాడు.


ఇజ్యుఁడు
సం., వి., అ., పుం., తత్స., = పూజ్యుడు, బృహస్పతి, పరమేశ్వరుడు, విష్ణువు ; విణ. గురువు.

ఇటీవల
అవ్య. = ఈ నడుమ, ఈ మధ్య, కొంతకాలం కిందట.

ఇటుక
= ఇటిక, బంకమట్టితోఁజేసి కాలవేసిన ఱాయి.

ఇట్చరము
సం., వి., అ., పుం., తత్స., = ఆఁబోతు, గోపతి, షండము.
వ్యుత్పత్త్యర్థము :
ఇషా స్వేచ్ఛయా చరతీతి ఇట్చరః. స్వేచ్ఛ చేత చరించునది.


ఇడ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఒకనాడి, శరీరములో ఎడమభాగము ఉన్ననాడి, నాడీ భేదము, నరము.
వ్యుత్పత్త్యర్థము :
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా. దీనియందు నిద్రింతురు.

నానార్థాలు :
నేల, ఇళ, యజ్ఞమునందలి భక్షణపాత్రము, బుధగ్రహపెండ్లాము, మాట, ఆవు, స్వర్గము, భూమి, ఇల, వాక్కు, హవిరన్నము, దేవీభేదము (మనువు కూతురు, బుధునిభార్య, పురూరవుని తల్లి ఈమెకు మైత్రావరుణి అని నామాంతరము), దుర్గాదేవి, పృథివి, ఇక్ష్వాకురాజకన్య, వచనము, దేవీభేదము.


ఇడాచిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = వరట, కందిరీగ.

ఇడిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = భూమి.

ఇడిక్కము
సం., వి., అ., పుం., తత్స., = అడవి మేకపోతు, ఆబోతు, ఏడకము, పొట్టేలు.

ఇడిముడిపాటు
వి. = కష్టపాటు.

ఇడ్(ల)
సం., వి., డ్., స్త్రీ., తత్స., = హవిష్వన్నము, అన్నము, భూమి, వర్ష ఋతువు.

ఇడ్వరము
సం., వి., అ., పుం., తత్స., = షండము, ఆబోతు.

ఇణ్
సం., నా. వా., త్రి., తత్స., = గతము, పోయినది.
నానార్థాలు :
పొందినది, ప్రాప్తము, తలపబడినది, స్వీకారము, సంబంధమాత్రము, సమోపాగమనము, ప్రత్యాగమనము, పలాయనము, పరిక్రమణము, అభిప్రాయము, విఖ్యాతము, విశ్వాసము.


ఇతః
సం., అవ్య., తత్స., = ఈ అర్థమునందు, దీనియందు.

ఇతఃపరము
సం., క్రి., విణ., అ., న., తత్స., = ఇఁకమీఁద.

ఇతఃపూర్వము
అవ్య. = ఇంతకుముందు, వెనుక.

ఇతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = గతము, పోయినది.
నానార్థాలు :
పొందినది, ప్రాప్తము, పొందపడినది.


ఇతరత్రా
అవ్య.= వేరొకచోట, వేరేచోట.

ఇతరథా
వేరువిధముగా.

ఇతరుఁడు
సం., స.,(అ. ఆ. అ.).,తత్స., = అన్యుడు, నీచుడు, అన్యతరుడు, ఏకుడు, అల్పుడు ; విణ. అధముడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇతం క్షుద్రవృత్తిం రాతీతి ఇతరః. క్షుద్రమైన నడవడిని పొందువాడు, ఇనా కామేనతరతీతి ఇతరః.

పర్యాయపదాలు :
వివర్ణుడు, పామరుడు, ప్రాకృతుడు, పృథక్ జనుడు, పరుడు, క్షుద్రుడు, నిహీనుడు, అపశదుడు, జాల్ముడు, క్షుల్లకుడు.


ఇతరేతరము
సం., స., (అ. ఆ. అ.)., తత్స., = పరస్పరము, ఒండొకటి, అన్యోన్యము, మిథము.

ఇతరేతరయోగము
సం., వి., అ., పుం., తత్స., = పరస్పర సంబంధము, (వ్యాక) సమాసములోని పదములన్నియు పరస్పరము కలసి మరియొకపదముతో అన్వయించుట. (ఇది ద్వంద్వ సమాసార్థములలో ఒకటి)

ఇతరేతరాశ్రయము
సం., వి., అ., పుం., తత్స., = అన్యోన్యాశ్రయము.

ఇతరేద్యుము
సం., అవ్య., తత్స., = మరునాడు, తరువాతిరోజు.

ఇతస్తతః
సం., అవ్య., తత్స., = ఇక్కడ అక్కడ, ద్వంద్వః, అన్నిచోట్లా.

ఇతి
సం., అవ్య., తత్స., = ఇట్లు, హేతువు, ఆది, పరకృతి,
నానార్థాలు :
మొదలు అను అర్థమునందు, ముగియుటయందునూ వర్తించును, కారణము, ప్రకాశము, నిదర్శనము, ప్రకారము, అనుకర్షము, సమాప్తము, ప్రకరణము, స్వరూపము, సాన్నిధ్యము, వివక్షానియమము, తుతము, ప్రత్యక్షము, అవధారణము, వ్యవస్థ, పరామర్శ, మానము, ఈ అర్థము, ప్రకర్షము, జ్ఞానము, ఋషిభేదము, ఈప్రకారముగా.


ఇతికథ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = అర్థములేనిమాట.
వ్యుత్పత్త్యర్థము :
ఇతి ఇత్యం కథా. నమ్మదగనిమాట.


ఇతికర్తవ్యత
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇట్లు చేయవలయును అనుసంగతి.

ఇతికర్తవ్యతామూఢుడు
వి= ఏమి చేయుటకు దిక్కు తోచనివాడు.

ఇతివృత్తము
వి. = చరితము, కథ, కథావస్తువు, చరిత్ర.

ఇతిశుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఒక ఋషి.

ఇతిహము
సం., అవ్య., తత్స., = ఐతిహ్యము, సంప్రదాయమును తెల్పునది, అలాగే, పారంపర్యోపదేశము.

ఇతిహాసపురాణము
సం., నా. వా., అ., న., తత్స., = అథర్వవేదభాగభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇతిహాసపురాణసమాహారే చ, ఇతిహాసావేదకం పురాణమ్, ఇతిహాస పురాణ సమాహారము.


ఇతిహాసము
సం., వి., అ., పుం., తత్స., = పూర్వ చరిత్ర ప్రతిపాదక గ్రంథము, తొల్లిటి కథ, పురావృత్తము, మహాభారతము మొదలైనవి.
వ్యుత్పత్త్యర్థము :
ఇతిహ పారంపర్యోపదేశః, ఆంతే అస్మిన్నితీతిహాసః, పారం పర్యోపదేశము దీనియందుఁకలదు.


ఇతోధికము
వి.=ఇంతకంటె ఎక్కువ.

ఇత్
సం., నా. వా., త్రి., తత్స., = వేదదీ గతము, పోయినది.
నానార్థాలు :
పొందినది, ప్రాప్తము, తలపబడినది, అవధారణము, అనంతరము.


ఇత్కిలము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = రోచన అను గంధద్రవ్యము, గోరోజనము.

ఇత్థంభావము
సం., నా. వా., అ., పుం., తత్స., = పద్ధతి.

ఇత్థంభూతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇట్టిది.

ఇత్థంవిధము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇట్టివిధము కలది.

ఇత్థమ్
సం., అవ్య., తత్స.,= ఇట్లు.

ఇత్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = పొందతగినది.

ఇత్యాది
విణ. = మొదలయిన.

ఇత్రాలము
సం., వి., అ., న., తత్స.,= కరబుజము.

ఇత్వము
వి. =ఇకారము.

ఇత్వరము
సం., వి., అ., పుం., తత్స., = ఇట్చరము, ఆబోతు.

ఇత్వరి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = వ్యభిచారిణి, అభిసారిక, వేశ్య.
వ్యుత్పత్త్యర్థము :
ఏతి అసాథు జనస్థానం తాచ్ఛీల్యేనేతి. అసాధు జనస్థానమును గూర్చిపోవునది, ఇతి పరపురుషం ప్రాప్నోతీతి ఇత్వరీ.

పర్యాయపదాలు :
పుంశ్చలి, ధర్షణి, బంధకి, కులట, కర్షణి, స్వైరిణి, పాంసుల, అసతి, ఱంకుటాలు.


ఇత్వరుఁడు
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = పోవువాడు, పధికుడు, క్రూరుడు, నీచుఁడు, దరిద్రుఁడు, క్రూరకర్ముఁడు, బాటసారి.

ఇత్వాది
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇది మొదలుగాకలది.

ఇత్వాస
ఒకచెట్టు

ఇదంకార్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = తీటకసింద (వృ.వి).

ఇదంతనుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇప్పటివాడు.
వ్యుత్పత్త్యర్థము :
అస్మిన్ కాలే భవః. ఈకాలమునకు చెందినవాడు.


ఇదమిత్థంగా
అవ్య. = ఉన్నది ఉన్నట్లుగా, నిర్దిష్టంగా, స్పష్టంగా.

ఇదమ్
సం., విణ., త్రి., తత్స., = ఇది.

ఇదా
సం., అవ్య., తత్స., = ఇప్పుడు. (వైదికము)

ఇదానీంతనము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇప్పటిది.

ఇదానీమ్
సం., అవ్య., తత్స., = ఇప్పుడు, ఏతర్హి, సంప్రతి, అధునా, సాంప్రతము.

ఇదావత్సరము
సం., వి., అ., పుం., తత్స., = వత్సరభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇదా చిహ్నితః వత్సరః.

ఇదివరకు
అవ్య. = ఇంతకుముందు, ఇంతవరకు.

ఇద్దము
సం., వి., అ., పుం., తత్స., = ప్రకాశము, ఆతపము, ఆశ్చర్యము, కాంతిమంతము, దీప్తము ; విణ. పరిశుద్ధము, ప్రకాశితము.

ఇద్దుము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = దీప్తము, కాంతిమంతము.

ఇద్ధా
సం., అవ్య., తత్స., = ప్రకాశము.

ఇద్య
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = వెలిఁగించుట, రగుల్చుట.

ఇద్యమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కాల్పఁబడుచున్నది.

ఇధ్మజిహ్వుడు
సం., వి., అ., పుం., తత్స., = అగ్ని.

ఇధ్మప్రవ్రశ్ఛనము
సం., వి., అ., పుం., తత్స., = ఇధ్మములను నఱకునది, గొడ్డలి.

ఇధ్మము
సం., వి., అ., న., తత్స., = వంటచెఱకు, వసంతఋతువు ; హి. వి. ఇనాం, ఈనాం, బహుమతి, మాన్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఇంధే అగ్నిరనేన ఇంధనం, ఇధ్మశ్చ. దీనిచేత అగ్ని ప్రకాశించును.

పర్యాయపదాలు :
చిదుగు, ఇంధనము, ఏధస్సు ; స్త్రీ. సమిధ ; పుం. ఏధము, అగ్నిసందీపన కాష్టము.


ఇధ్మవాహుడు
సం., వి., అ., పుం., తత్స., = దృఢచ్యుతుడు, అగస్త్యపుత్రుడు, ఒక ఋషి.

ఇనసభ
సం., వి., అ., న., తత్స., = రాజసభ.

ఇనాము
వి. = బహుమానము, మాన్యము.

ఇనుఁడు
సం., వి., అ., పుం., తత్స., = సూర్యుడు, ప్రభువు, నృపుడు, రాజు.
వ్యుత్పత్త్యర్థము :
పతీతి ఇనః, సూర్యదేవతాకమగు నక్షత్రము.

నానార్థాలు :
ఆత్మ, హస్తనక్షత్రము, ధనికుడు, మగఁడు, ఆఢ్యుడు, సమృద్ధుడు, స్వామి, ఒకరాజు.


ఇనుపకచ్చడము
వి. = ఇనుపగోచి, ఇంద్రియనిగ్రహము.

ఇనుపగజ్జెలతల్లి
వి.= దరిద్రదేవత, పెద్దమ్మ.

ఇనుమడుగు
వి. = రెట్టింపు.

ఇనుమనుమడు
వి. = మునిమనుమడి లేదా ముని మనుమరాలి కొడుకు.

ఇనుమనుమరాలు
వి. = పౌత్రపుత్రిక, మునిమనుమడి కూతురు.

ఇన్వక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మృగశిరమీది మూడు నక్షత్రములు.

ఇబ్బడిముబ్బడిగా
అవ్య. = లెక్కకు మిక్కిలిగా, అధికంగా, పుష్కలంగా.

ఇభకణ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = గజపిప్పలి(వృ.వి).

ఇభకేశరము
సం., నా. వా., అ., పుం., తత్స., = నాగకేశరము(వృ.వి).

ఇభగంధ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = స్థావర విషభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇభస్య గంధ ఇవ గంధవత్ పుష్పమస్యాః. ఏనుగు యొక్క గంధము వంటి గంధము కలిగిన పువ్వు.


ఇభదంత
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గజదంతము, స్థావరఫలవిషము.
వ్యుత్పత్త్యర్థము :
ఇభస్య దంత ఇవ శుభ్రం పుష్పమస్యాః. ఏనుగు యొక్క దంతము వలే తెల్లనైన పుష్పము కలిగి ఉన్నది.


ఇభనిమీలిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = గంజాయి, (దీనిని తినినయెడల ఏనుగునకైనను నిద్రవచ్చును) వైదగ్ధ్యము, నేర్పు, చాతుర్యము, భంగ.

ఇభపాలకుడు
సం., వి., అ., పుం., తత్స., = ఏనుగులను పాలించేవాడు.

ఇభపోట
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మగయేనుగులక్షణములు కూడా గల ఆడ ఏనుగు.

ఇభభరము
సం., నా. వా., అ., పుం., తత్స., = యూధము, గజసముహము.

ఇభమాచలము
సం., నా. వా., అ., పుం., తత్స., = సింహము.
వ్యుత్పత్త్యర్థము :
ఇభమాచలయతి. ఏనుగుని వధించేటటువంటిది.


ఇభము
సం., వి., అ., పుం., తత్స., = ఏనుగు, హస్తి, ద్విపము.
వ్యుత్పత్త్యర్థము :
ఏతి మదమితి ఇభః. మదమును పొందునది.

పర్యాయపదాలు :
దంతి, దంతావళము, ద్విరదము, అనేకపము, మతంగజము, గజము, నాగము, కుంజరము, వారణము, కరి, స్తంబేరము, పద్మి.


ఇభయ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = స్వర్ణక్షీరి, రెడ్డివారినానబ్రాలు (వృ.వి).

ఇభాఖ్యము
సం., నా. వా., అ., పుం., తత్స., = నాగకేశరము (వృ.వి).

ఇభాననుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = గణపతి, గణేశుడు, వినాయకుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇభస్యామనమేవాననం యస్య. ఏనుగు ముఖము వంటి ముఖము కలిగినవాడు.


ఇభారి
సం., నా. వా., ఇ., పుం., తత్స., = సింహము.

ఇభి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = హస్తి, ఆడేనుగు.

ఇభోషణ
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = గజపిప్పలి(వృ.వి).

ఇభ్య
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అందుగు, ఏనుగువంగ, ఆడేనుగు ; విణ. ఒడయురాలు.

ఇభ్యకుఁడు
వి. = ధనవంతుడు, ప్రభువు, రాజు, మావటీడు, పోషకుడు, మావటివాడు.

ఇభ్యుఁడు
సం., వి., అ., పుం., తత్స., = మావటివాడు, ధనికుడు, ధనవంతుడు, ప్రభువు, రాజు, ఆఢ్యుడు, ధని.
వ్యుత్పత్త్యర్థము :
ఇభమర్హతీతి ఇభ్యః. ఏనుగును ఎక్కుటకు అర్హుడు.


ఇముడ్చుకొను
స. క్రి. = దాచు, మరుగుపరుచు, అ. క్రి. దాగు, పొందుపడు, ఇముడుకొను.

ఇయత్
సం., విణ., (త్. ఈ. త్.)., తత్స., = ఇంత.
వ్యుత్పత్త్యర్థము :
ఇదం పరిమాణమస్య. ఇంతపరిమితిగలది.

ప్రయోగము :
ఉదా- ఇంతభాగ్యము.


ఇయత్త
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = కొలది, సీమ, పరిమాణము.
వ్యుత్పత్త్యర్థము :
ఇయతో భావః. ఇంత అను పరిమాణము.


ఇర
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నీళ్లు, నేల, సుర, వాక్యము, భూమి, వాక్కు, ఆపము, జలము.
వ్యుత్పత్త్యర్థము :
1.యంతి భ్రామ్యంతనయేతి ఇరా. దీనిచేతతిరుగుదురు. ఈయత ఇతి ఇరా. పొందపడునది, 2.ఇం కామం రాతి దదాతి ఇతి ఇరా.

నానార్థాలు :
సరస్వతి, మాట, అన్నము, మేర, కశ్యపుని భార్య.

పర్యాయపదాలు :
హలిప్రియ, హాల, పరిస్రుతము, వరుణాత్మజ, గంధోత్తమ, ప్రసన్న, కల్లు, పరిస్రు, కాదంబరి, మదిర ; నపుం. మద్యము, కశ్యము.


ఇరకటము
వి. = ఇబ్బంది, కష్టం, ఇరుకుచోటు, క్లిష్టపరిస్థితి, హి. ఇరకాటం, ఇరకటం.

ఇరజము
సం., వి., అ., పుం., తత్స., = ఇరాజము, కామము.

ఇరణము
సం., విణ., (అ. ఆ. అ.)., తత్స., = ఉషరభూమి, చవిటినేల.

ఇరమ్మదము
సం., వి., అ., పుం., తత్స., = మేఘమునందలి అగ్ని, వజ్రాగ్ని, మేఘాగ్ని, వాతజాగ్ని, మెరుపు, మేఘము ; నపుం. మేఘజ్యోతి.
వ్యుత్పత్త్యర్థము :
ఇరయా జలేన మాద్యతి దీప్యత ఇతి ఇరం మదః. ఇరయనగా జలము, దాని చేత వృద్ధిఁపొందునట్టిది.

నానార్థాలు :
మద్యము, ఆహారము, భూమి, వాక్కు, నీరు.


ఇరాక్షీరము
సం., నా. వా., అ., పుం., తత్స., = క్షీరసముద్రము, పాలసముద్రము.
వ్యుత్పత్త్యర్థము :
ఇరా జలం క్షీరమివాస్య.


ఇరావణము
సం., వి., అ., న., తత్స., = కల్లుగల వనము ; పుం. ఐరావతము, అభ్రమాతంగము, ఐరావణము, అభ్రమువల్లభము.
వ్యుత్పత్త్యర్థము :
ఇరాహాలా తత్ప్రధానం వనమిరావణం, తత్ర జాతః. కల్లు గల వనము ఇరావణము, అందు బుట్టినది.


ఇరావతి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = రావిచెట్టు (రాగి).
వ్యుత్పత్త్యర్థము :
ఇరాం భూమిమ్ అవతి. పంజాబు నందలి ప్రవహించు ఒక నది.


ఇరావతుడు
సం., నా. వా., అ., పుం., తత్స., = ఇరావంతుడు, రాజు, అర్జునకును ఉలూచికినూ పుట్టినవాడు.

ఇరింగణము
సం., వి., అ., పుం., తత్స., = వడిగాలి.

ఇరికించు
స. క్రి. = నేరం లేకున్నా ఉన్నట్లుగా ఆరోపించి చేర్చు, దూర్చు.

ఇరిణము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = చవిటినేల, చవుటిది(నేల), పాడైనది (రూ. ఈరిణము), రక్షణస్థానము, ఊషరభూమి, శూన్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఇయర్తినాశం గచ్ఛతీతి ఇరిణం. నాశనమును పొందునది, ఋచ్చతీతి ఇరిణం.


ఇరిమేదము
సం., నా. వా., అ., పుం., తత్స., = అరిమేదము, వెలితుమ్మ(వృ.వి).

ఇరివిల్లిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = తలయందు కలుగు వ్రణభేదము.

ఇరుకు
వి. = సన్నదారి, సరిపోని స్థలం, చాలని చోటు, పంగలకర్ర దారి, పంగలకొయ్య, సమ్మర్దం ; విణ. సంకుచితమైన ; క్రి. సందులో దూరు, ఇముడు, నొక్కిపట్టు.

ఇరుకునపడు
క్రి. = సంకటావస్థలో పడు, ఎటూ చెప్పలేని స్థితిలో ఉండు.

ఇరుకునొప్పి
వి. = బెణుకునొప్పి, ఇలుకు నొప్పి.

ఇరుకుమాను
వి. = పంగలకొయ్య.

ఇరుకుమెడ
వి. = పొట్టిమెడ.

ఇరుగుపొరుగు
వి. = చుట్టుపక్కల, చుట్టుపక్కల ఉన్నవాళ్లు.

ఇరుముడి
వి. = రెండుమూటలు, అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకి ఒక వస్త్రంలో ఒకవైపు దైవసంభారాన్ని, మరోవైపు దారి బత్తేన్ని కట్టుకున్న మూట.

ఇరేశుడు
సం., వి., అ., పుం., తత్స., = వరుణుడు, వాగీశుడు, భూమిపతి, విష్ణువు.

ఇర్గలము
సం., వి., అ., న., తత్స., = తలుపుగడియ.

ఇర్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రేరకము.

ఇర్వారువు
సం., నా. వా., ఉ., స్త్రీ., తత్స., = ఒక చెట్టు, పెద్ద చీర, దోస(వృ.వి), హింస, ఊర్వారుకము.

ఇల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = నేల, బుధుని పెండ్లాము, భూమి, వాక్కు, పృథ్వి.
వ్యుత్పత్త్యర్థము :
ఇలతి విష్ణువరాత్ పుంస్త్వం ప్రాప్నోతి ఇతి ఇలా. విష్ణువరముచేత పురుషత్వమును పొందినది ఇలా.

పర్యాయపదాలు :
భూః, అచల, అనంత, రసా, విశ్వంభర, స్థిర, ధర, ధరిత్రి, ధరణి, క్షోణి, జ్యా, కాశ్యపి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, గోత్ర, కుః(మ్రోయునది), పృథివి, క్ష్మ, అవని, మేదిని, మహీ, విపుల, గహ్వరి, ధాత్రి, గౌః, కుంభిని, క్షమ, జగతి, రత్నగర్భ, భూతధ, అబ్దిమేఖల.

నానార్థాలు :
వైవస్వతముని కన్య, ఆవు, మాట, వాక్యము, నాడి, స్వర్గము, వెల.


ఇలవిల
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = విశ్రవసునిభార్య, కుబేరుని తల్లి.

ఇలావృతము
సం., నా. వా., అ., న., తత్స., = మేరుసమీపదేశము.
వ్యుత్పత్త్యర్థము :
ఇలా పృథివీవావృతం నిషధాదిభిః. (1)నవవర్షాత్మకజంబుద్వీపస్య వర్షభేదేతచ్చ వర్షమ్ మేరు.


ఇలి
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = ఒకకత్తి, కరవాలము, కటారి.

ఇలిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = అడవిమేక, భూమి.

ఇలికము
సం., వి., అ., పుం., తత్స., = ఎలుక.

ఇలిని
సం., వి., ఈ., స్త్రీ., తత్స., = చంద్రవంశమేథాతిధిరాజుకుమార్తె.

ఇలిశ
సం., వి., అ., పుం., తత్స., = నక్షత్రములమీద సంచరించునది, నక్షత్రవిశేషము, మృగశిరమీద మూడు నక్షత్రములు, మత్స్యభేదము, వాతాపి అను రాక్షసుడు, ఇతడు అగస్త్యునిచే చంపబడెను, ఒక అసురుడు.

ఇల్లము
మి. గ్రా. వి. = (ఇరు + పలము) రెండు పలములు.
ప్రయోగము :
ఇల్లమనంగను నెసఁగుద్విపలి. (ఆం, భా. ద్వి. వై.)


ఇల్లామల్లిసుద్దులు
వి. బహు. = లేనిపోని మాటలు, కొండెపు మాటలు.

ఇల్లాయము
వి. =ఇంటిపన్ను.

ఇల్లుకట్టుకొను
అ. క్రి. = శాశ్వతంగా ఉండు.

ఇల్లుగడుచు
అ. క్రి = జీవనం జరుగు, సంసారం నడుచు.

ఇల్లుగుల్లచేయు
క్రి. = ఉన్నదంతా దుబారా చేయు, స్థిరచరాస్తులన్నిటినీ పాడు చేయు.

ఇల్లుదోచిపెట్టు
క్రి. = ఉన్నదంతా ఇతరులకు పంచిపెట్టు.

ఇల్లెడ
వి. = తాకట్టు, కుదువ.

ఇల్వల
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = మృగశీర్షనక్షత్రమునకు మీదనున్న నక్షత్రములకు ఇల్వల అని పేరు, శివునిబాణముచేత ప్రేరేపింపబడునవి, నక్షత్రవిశేషము, మృగశిరమీద మూడు నక్షత్రములు ; అ. పుం. ము. మత్స్యవిశేషము ; డు. ఒకానొక రాక్షసుఁడు.
వ్యుత్పత్త్యర్థము :
ఇలంతి గచ్ఛంతి నక్షత్రాణాం మూర్థ్నీతి ఇల్వలాః. నక్షత్రముల మీద సంచరించునవి.


ఇళ
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = బుధునిభార్య, ఆవు, మాట.

ఇషణము
సం., వి., అ., న., తత్స., = ఇచ్ఛ.(ఇషణత్రయము. - విత్తేషణము, పుత్రేషణము, దారేషణము)

ఇషము
సం., వి., అ., పుం., తత్స., = ఆశ్వయుజమాసము, ఆశ్వినము, గవేషణము, ప్రేరణము, ఇచ్ఛ, ఇనుము.
వ్యుత్పత్త్యర్థము :
1.ఏషణం ఇట్ యాత్రాసాస్మిన్నితి ఇషః. శత్రువుల గెలువనిచ్ఛయించినవారికి యాత్ర దీనియందుఁకలుగుచున్నది. 2.ఇష్యతే గమ్యతే అస్మిన్ జుగీషుభిరితి ఇషః.


ఇషి
సం., నా. వా., (ఇ. ఈ. ఇ)., తత్స., = ఇచ్ఛావతి. కోరికకలది.

ఇషిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ముండ్లదుబ్బు, ముండ్లమబ్బు
వ్యుత్పత్త్యర్థము :
ఈషా లాంగలికేవ ఈషికా, ఇషీకా చ. నాగేలువలె నిడివియైనది.

నానార్థాలు :
రెల్లుగడ్డి, ఏనుగు కనుగుడ్డు, అవురుగడ్డి, ముంజదర్భ, మొక్కలోని మొవ్వు, ఒక దేశము.


ఇషిరము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = గతిశీలము, చలనము, అగ్ని.

ఇషీక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = చిత్తరువురాసెడి కుంచె, తూలిక, ఈషిక, ఇషిక ; పుం. ఏనుగు కనుగుడ్డు, గజాక్షికూటకము, ఏనుగు భ్రూభంగము(అనికొందఱు) ; ముండ్లదుబ్బు ; నపుం. కాశతృణము, ఇషీకాస్త్రము, కాశాస్త్రము, అక్షిగోళకము.

ఇషుకామశమి
సం., నా. వా., ఈ., స్త్రీ., తత్స.,= పురీభేదము.

ఇషుకారము
సం., నా. వా., అ., పుం., తత్స., = బాణాకారకము, శిల్పిభేదము.

ఇషుధి
సం., వి., ఇ., పుం., తత్స., = అమ్ముల పొది.
వ్యుత్పత్త్యర్థము :
ఇషవోధీయంతే అత్రేతి ఇషుధిః. బాణములు దీనియందు ధరింపబడును.

పర్యాయపదాలు :
తూణీరము, తూణము, ఉపాసంగము, నిషంగము ; స్త్రీ. తూణి.


ఇషుప
సం., నా. వా., అ., పుం., తత్స., = అసురభేదము.
వ్యుత్పత్త్యర్థము :
ఇషుం పిబతి పాపానే క ఉపప.


ఇషుపుంఖము
సం., వి., ఆ., స్త్రీ., తత్స., =బాణపుంఖమువంటి పువ్వులుగలది, శరపుంఖావృక్షము, వెంపలి (వృ.వి).

ఇషువు
సం., వి., ఉ., పుం,, స్త్రీ., తత్స.,= బాణము, అమ్ము.
వ్యుత్పత్త్యర్థము :
ఇష్యతి గచ్ఛతీతి ఇషుః. లక్ష్యమును గూర్చి పోవునది.

పర్యాయపదాలు :
పుం. పృషత్కము, విశిఖ, అజిహ్మగము, ఖగము, ఆశుగము, కలంబము, మార్గణము, శరము, పత్రి, రోపము.

నానార్థాలు :
(గణిత) అయిదు, వృత్తక్షేత్రము లోపల జీవమధ్యావధి, పరిధిపర్యంతము గీచిన సరళ రేఖ(క్షేత్రగ), (లీలావతి), సామవేదపితృ యజ్ఞభేదము.


ఇష్ట
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = యాగము, శమి.
నానార్థాలు :
జమ్మి (వృ.వి). అభిలషితము, ప్రియము, యజ్ఞము, పూజితము, పరణవృక్షము, సంస్కారము, ధర్మకార్యము, కృతము, శ్రౌతకర్మణియందు, విష్ణువు, మిత్రుడు, వేల్వబడునది.


ఇష్టక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇటికఱాయి, మట్టితోచేసినది, మృత్ ఖండభేదము, ఇష్టిక, గృహము మొదలైనవాటిని నిర్మించుటకు ఉపయోగించే కాల్చిన మృత్ ఖండభేదము.

ఇష్టకాపథము
సం., వి., అ., న., తత్స., = ఇటుకలతో కట్టిన మార్గము, నీటివట్టివేరు, అవురు గడ్డి వేరు.
వ్యుత్పత్త్యర్థము :
వాతవత్త్వేన గమననిరోధకత్వాదిష్టం కాపధమన్యేతి ఇష్టకాపథం. వాతకారియై గమనమును నిరోధించుట చేతనిష్టమైన కుత్సిత మార్గముకలది.

పర్యాయపదాలు :
ఉశీరము, అభయము, నళదము, సేవ్యము, మృణాళము, జలాశయము, లామజ్జకము, లఘువు, లయము, అవదాహము.


ఇష్టకావము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇష్టకాయుక్తము.

ఇష్టగంధము
సం., వి., అ., న., తత్స., = నూగు దోస ; విణ. మంచివాసనకలది, సుగంధద్రవ్యము, సురభి, ఘ్రాణతర్పణము, సుగంధి.
వ్యుత్పత్త్యర్థము :
ఇష్టః గంధః అస్యాస్తీతి ఇష్టగంధః. ఇష్టమైన గంధమును కలిగినది.


ఇష్టతమము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ప్రియతమము, అతిశయాభీష్టము.

ఇష్టదేవత
సం., నా. వా., అ., పుం., తత్స., = ప్రియదేవత.

ఇష్టము
సం., వి., అ., న., తత్స., = యజ్ఞకర్మము, మిత్రుడు, సంస్కారము ; పుం. యజ్ఞము, యాగము, యజ్ఞమునందలి హోమదానాదిక్రియ, యజ్ఞమునకు అర్హమైన వస్తువు పేరు ; విణ. కోరపడినది, ప్రియమైనది, పూజింపఁబడినది.
వ్యుత్పత్త్యర్థము :
1.ఇజ్యతే స్మ ఇష్టం. వేల్వపడునది. ఇష్యత ఇతీష్టం. ఇచ్ఛయింపపడునది.

పర్యాయపదాలు :
కామము, ప్రకామము, పర్యాప్తము, నికామము, ఈప్సితము.


ఇష్టవతము
సం., నా. వా., త్., న., తత్స., = యజ్ఞకర్త, కోరిక, వేదమందు పూర్వపద దీర్ఘము.

ఇష్టసిద్ధి
వి. = కోరిన కోరిక తీరడం.

ఇష్టా
సం., నా. వా., ఆ., స్త్రీ., తత్స., = జమ్మి వృక్షము (వృ.వి).

ఇష్టాకృతము
సం., నా. వా., (అ. ఆ. అ)., తత్స., = మెచ్చదగినదానిగా చేయుట, ఇష్టీకృతము.
వ్యుత్పత్త్యర్థము :
అనిష్టమిష్టం కృతమ్. ఇష్టం లేనిది ఇష్టంగా చేయడము.


ఇష్టాగోష్ఠి
వి. = పిచ్చాపాటి, అనధికార సమావేశము(మిత్రులు మొదలైనవారితో సంభాషణ).

ఇష్టాపత్తి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = కోరిక నెరవేరుట, (తర్క) ఇష్టమైన యాపత్తి, ప్రతివాదికనుకూలమైన ఆపేక్షము.

ఇష్టాపూర్తము
సం., నా. వా., అ., న., తత్స., = ఇష్టమును, పూర్తమను, (ఇష్టమనగా అగ్నిహోత్రాది కర్మము. పూర్తమనగా వాపీకూపతటాకారామ దేవాలయ నిర్మాణమును అన్నదానమును).

ఇష్టాయిష్టాలు
వి. బహు. = రాగద్వేషాలు.

ఇష్టార్థోద్యుక్తుడు
సం., విణ.,(అ. ఆ. అ)., తత్స.,= ఉత్సుకుడు, ఇష్టమైన ప్రయోజనమందు ఉద్యోగాతిశయము గలవాడు.

ఇష్టావతి
సం., నా. వా., ఇ., స్త్రీ., తత్స., = కోరికనెరవేరుట, ఇష్టమైన ఆపత్తి, ప్రతివాదికనుకూలమైన ఆపేక్షము.

ఇష్టి
సం., వి., ఇ., స్త్రీ., తత్స., = యజ్ఞము, కత్తి, కోరిక, సంగ్రహ శ్లోకము, యాగము, ఇచ్ఛ, వ్యాకరణభాష్యకారుల ఉద్దేశమును తెలుపువాక్యము.
వ్యుత్పత్త్యర్థము :
ఇజ్యత ఇతి, ఇచ్ఛా చ ఇష్టిః. యజించుటయు, ఇచ్ఛయించుటయు .


ఇష్టిక
సం., వి., ఆ., స్త్రీ., తత్స., = ఇష్టక, ఇటికఱాయి, మట్టితోచేసినది, మృత్ ఖండభేదము, గృహము మొదలైనవాటిని నిర్మించుటకు ఉపయోగించే కాల్చిన మృత్ ఖండభేదము.

ఇష్టిపచుడు
సం., వి., అ., పుం., తత్స., = దేవతార్థముకాక స్వతృప్తికొఱకు మాత్రమే వండుకొనువాడు, కృపణుడు, పిసినిగొట్టు, దైత్యుడు.

ఇష్టిపశువు
సం., వి., ఉ., పుం., తత్స., = యజ్ఞపశువు.

ఇష్టీకృతము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇష్టిభేదము.
వ్యుత్పత్త్యర్థము :
అనిష్టమిష్టం కృతమ్. ఇష్టం లేనిది ఇష్టంగా చేయడము.


ఇష్టుడు
సం., వి., అ., పుం., తత్స., = ప్రియుడు, మగడు, నచ్చిన వ్యక్తి, చెలికాడు, ఆప్తుడు, మిత్రుడు.
ప్రయోగము :
క. అ. వ్విదురువచనంబ నిలువుదు,
హృదయంబున నతఁడు పెద్దయిష్టుఁడు మీకున్. (భార. ఆది. 8. 19.)



ఇష్మము
సం., నా. వా., అ., పుం., తత్స., = వసంతఋతువు.

ఇష్ముడు
సం., నా. వా., అ., పుం., తత్స., = మన్మథుడు.

ఇష్యమానము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = కోరబడుచున్నది.

ఇష్యము
సం., నా. వా., అ., పుం., తత్స., = వసంత ఋతువు.

ఇష్వగ్రము
సం., నా. వా., అ., న., తత్స., = బాణాగ్రము.

ఇష్వననము
సం., నా. వా., అ., పుం., తత్స., = బాణము, చిమ్మునది, ధనువు, విల్లు.

ఇష్వనీకము
సం., నా. వా., అ., న., తత్స., = బాణావయవము.

ఇష్వము
సం., నా. వా., అ., పుం., తత్స., = కోరిక, గురువు.

ఇష్వాసము
సం., వి., అ., న., తత్స., = ధనుస్సు, విల్లు ; త్రి. ఇషుక్షేపకము.
వ్యుత్పత్త్యర్థము :
ఇషవః అస్యంతేనేనేతి ఇష్వాసః. బాణములు దీనిచేత వేయబడును.

పర్యాయపదాలు :
ధన్వము, చాపము, శరాసనము, కోదండము, కార్ముకము.


ఇష్వాసుఁడు
సం., వి., అ., పుం., తత్స., = విలుకాఁడు, ఆచార్యుడు.
వ్యుత్పత్త్యర్థము :
ఉపదేశము కొఱకు చేరతగినవాడు.


ఇసుకపాతర
వి.= ఎంత తీసినా తరగని నిధి, అత్యధికమైన ధాన్యం నిలువలు, విణ. హద్దులేని, అంతులేని.

ఇసుమంత
విణ. = స్వల్పమైన, కొంచెము.

ఇహకాలము
సం., నా. వా., అ., పుం., తత్స., = వర్తమానకాలము.

ఇహగతుడు
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., =ఇక్కడకు వచ్చినవాడు, ఇక్కడకు వచ్చినది.

ఇహత్యము
సం., విణ., (అ. ఆ. అ)., తత్స., = ఇక్కడిది, ఈలోకముననున్నది, ఇప్పటిది, ఈకాలమందున్నది.

ఇహపరాలు
వి. బహు. = ఈలోకము పై లోకము.

ఇహమాత్రఫలము
సం., నా. వా., అ., న., తత్స., = ఇహికాముష్మికఫలము, ఇహపరములందలి కర్మఫలము.

ఇహము
సం., అవ్య., తత్స., = ఇహలోకము, ఈ లోకము, ఈకాలము, అనుభవించునది.
ప్రయోగము :
గీ. కుడిచికట్టిన నున్కిగా కిడుమపడుచు,
నింటనున్ననుబురుషార్థమేమి కలదు,
కడఁగి యిహమైనఁబరమైనఁగాకదాన,
యూరకుండుట నరునకుఁబౌరుషంబె. (భో. ౨, ఆ)


ఇహలోకము
సం., వి., అ., పుం., తత్స., = ఈలోకము.