హల్లులు : ద
దండధరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. కాలదండాఖ్యస్య దండస్యధరః దండధరః. కాల దండమనెడి దండమును ధరించినవాడు, యముడు, రాజు.
దండనీతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. దమ్యతే అనేనేతి దండః చతుర్థోపాయః స అనయానీయత ఇతి దండ నీతిః. సామ దానాదులలో నాల్గవ ఉపాయము, కామంద కాద్యర్థ శాస్త్రము, అర్థశాస్త్రము.
దండము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దండకారిత్వా ద్దండః. దండించువాడు, చతురుపాయములలో ఒకటి, రాజశిక్ష, గర్వము, పీడనము. దమనం దండః. శిక్షించుట, వాద్యము వాయించెడు కొడుపు, అడ్డముగా తీర్చిన వ్యూహము. దమ్యతే అనేనేతి దండః. దీని చేత శిక్షింపబడును, దుడ్డుకర్ర, చెట్టుబోదె, కాడ, కవ్వము, దండు,వధము, బార, గుర్రము, తోక తెగిన ఎద్దు, హారము నందలి పేట, కప్పము, జత, సమూహము. దండయతి అనేనేతి దండః. శిక్ష, పీడించుట, మిథ్యాజ్ఞ, సైన్యభేదము.
దండాహతము
సం. నా. వా. అ. న. తత్స. దండేన మధ దండే నా హతం దండాహతం. కవ్వము చేత చిలుకపడునది, మజ్జిగ, కాలశేయము. దండేన మథ్నా ఆహతం దండాహతం.
దంతధావనము
సం. నా. వా. అ. పుం. తత్స. దంతాన్ ధావయంత్యనేన దంతధావనః. దంతములు దీని చేత పవిత్రము చేయుదురు, చండ్ర చెట్టు.
దంతభాగము
సం. నా. వా. అ. పుం. తత్స. దంత సన్నిహితో భాగీ దంత భాగః. దంతములకు సమాపమైన భాగము, ఏనుగు ముందరి భాగము.
దంతము
సం. నా. వా. అ. పుం. తత్స. దమ్యతే భక్ష్యమేభిరితి దంతాః. భక్ష్య వస్తువు దీని చేత భక్షింపబడును, పల్లు, కొండ నడుము, పొదరిల్లు, పొడవురాయి, దశనము.
దంతశఠ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ఆమ్లత్వాదంతానాం శఠం కరోతీతి దంతశఠా. దంతములను శఠత్వమును చేయునది, పులిచింత చెట్టు.
దంతశఠము
సం. నా. వా. అ. పుం. తత్స. ఆమ్ల త్వాత్ దంతానాం శఠో దంతశఠః. పులుసౌట వలన దంతములకు నహితమైనది, వెలగచెట్టు, నిమ్మ, చింత, నారద చెట్టు.
దంతావళము
సం. నా. వా. అ. పుం. తత్స. దంతావస్యస్త ఇతి దంతావళః. దంతములు కలది, ఏనుగు, సామజము.
దంతి
సం. నా. వా. న్. పుం. తత్స. దంతివస్యస్త ఇతి దంతీ. దంతములు కలది, ఏనుగు, కొండ. సం. వా. నా. ఈ. స్త్రీ. తత్స. ఒక చెట్టు. సం. విణ. తత్స. కోరపళ్లువాడు.
దందశూకము
సం. నా. వా. అ. పుం. తత్స. కుత్సితం దశతీతి దందశూకః. కుత్సితముగా కరచునది, సర్పము, పాము, కరచు జంతువులు.
దంభము
సం. నా. వా. అ. పుం. తత్స. దభ్నోతి హినస్తీతి దంభః. పీడించునది, కపటము, తప్పు, మోసము.
దంభోళి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దంభాదాటో పాల్లీయత ఇతి దంభోళిః. వజ్రాయుధము, రాతి వాలి, వజ్రము.
దంశనము
సం. నా. వా. అ. న. తత్స. దశతి శరీరమితి దంశనం. శరీరమును కలిసి ఉండునది, కాటు, కవచము.
దంశము
సం. నా. వా. అ. పుం. తత్స. దంశతీతి దంశః. కరచునది, అడవి ఈగ, కాటు, కవచము, దోమ, పల్లు.
దంశి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. అల్పా దంశజాతిః దంశీ. అల్పమైన అడవి జాతి ఈగ, అడవి దోమ, చిన్న దోమ.
దంశితుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దంశస్తదస్య సంజాతమితి దంశితః. కాటుపడ్డవాడు, కవచము తొడిగినవాడు. దంశో వర్మ సంజాతో అస్య, పరిహితత్వాదితి దంశితః. కవచదారి.
దంష్ట్రి
సం. నా. వా. న్. పుం. తత్స. ప్రశస్తాః దంష్ట్రా అస్య సంతీతి దంష్ట్రీ. వాడి కోరలు కలది, అడవి పంది, సర్పము, మొసలి, పులి, ఎలుక.
దక్షిణ
సం. నా. వా. ఆ. స్త్రీ. దక్షతే ఇతి దక్షిణా. తత్స. యఙ్ఞములో ఋత్విజులకు ఇచ్చు ధనము, కుడిదిక్కు, సంభావన, అర్ణము, కోరికలు తీర్చువాడు.
దక్షిణము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దక్షతే బలవత్తయా వర్ధత ఇతి దక్షిణం. బలము కలుగుట చేత వృద్ధి పొందునది, కుడి దిక్కు, కుడి, అర్హము, కోరికలు తీర్చువాడు, నమ్మతగినవాడు.
దక్షిణస్థుడు
సం. నా. వా. అ. పుం. తత్స. అశ్వాక్ ప్రేరయితుం కదాచిత్సవ్వే, కదా చిద్దక్షిణే చ తిష్ఠతీతి దక్షిణస్థః. గుర్రములను తోలునపుడు కొంతసేపు ఎడమదిక్కును,కొంతసేపు కుడిదిక్కున ఉండువాడు, తేరు నడుపువాడు. దక్షిణే భాగే తిష్ఠతీతి దక్షిణస్థః. సారథి, ధక్షిణమున ఉన్నసారధి.
దక్షిణాగ్ని
సం. నా. వా. ఇ. పుం. తత్స. వేద్యా దక్షిణో అగ్నిః దక్షిణాగ్నిః. వేదికి దక్షిణమైన అగ్ని, ఒక శ్రౌతాగ్ని.
దక్షిణీయుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దక్షిణాం అర్హతీతి దక్షిణేయః. దక్షిణ పుచ్చుకొన అర్హత కలిగినవాడు.
దక్షిణుడు
సం. విణ. తత్స. దక్షతే పరకార్యం శీఘ్రం కరోతీతి దక్షిణః. పరప్రయోజనమును శీఘ్రముగా చేయువాడు, కుటిలము గాక చక్కనైన మనస్సు కలవాడు, దాక్షిణ్యము కలవాడు, నేర్పు కలవాడు. సరళమైనవాడు, ఉదార స్వభావము కలవాడు, నమ్మకము కలవాడు.
దక్షిణేర్మము
సం. నా. వా. న్. పుం. తత్స. దక్షిణే దక్షిణ భాగే ఈర్మం వ్రణమస్య దక్షిణేర్మా. వేటగాని చేత కుడి దిక్కున గాయము కలిగిన మృగము, జింక.
దక్షిణ్యుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దక్షిణాం అర్హతీతి దాక్షిణ్యః. దక్షిణ ఇయ్యతగినవాడు.
దక్షుడు
సం. విణ. తత్స. దక్షతే కార్యం శీఘ్రం కరోతీతి దక్షః. కార్యమును త్వరగా చేయువాడు, నేర్పరి. చతురుడు, సమర్థుడు, కోడి, నిపుణుడు, తెలివైనవాడు.
దగ్థము
సం. విణ. తత్స. దహ్యతే స్మ దగ్థః. కాల్చబడినది.
దగ్థిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దగ్థైవ దగ్థికా. మాడినది, మాడిన వంటకము,మాడు.
దదిత్థము
సం. నా. వా. అ. పుం. తత్స. దధీవ తిష్ఠతీతి దధిత్థః. పెరుగు వలె ఉండునది, వెలగ (వృక్ష విశేషము).
దద్రుఘ్నము
సం. నా. వా. అ. పుం. తత్స. దద్రుం హంతీతి దద్రుఘ్నః. దద్దు రోగమును, చెరచునది, తగిరిస చెట్టు.
దద్రుణుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దరిద్రయతి దద్రుః సాస్యాస్తీతి దద్రుణః. కుష్ఠ భేదము కలవాడు, దద్దురోగము కలవాడు.
దధి ఫలము
సం. నా. వా. అ. పుం. తత్స. దధివ దామ్లం ఫలమస్యేతి దధిఫలః. పెరుగు వలె పుల్లనైన ఫలములు కలది, వెలగ చెట్టు.
దనుజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దనోర్జాతా దనజాః. దనువనెడి స్త్రీ వలన పుట్టినవారు, రాక్షసులు.
దభ్రము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దభ్యతే నివార్యత ఇతి దభ్రం. అడ్డగింప పడునది, సూక్ష్మము, సన్నము, అల్పము, హ్రస్వము, కొంచెము.
దమథము
సం. నా. వా. అ. పుం. తత్స. దమనం దమధః. క్లేశమును ఓర్చుతనము, దండనము, నిగ్రహము.
దమము
సం. నా. వా. అ. పుం. తత్స. దమనం దమః. ఓర్చుట, దండోపాయము, క్లేశమునోర్చుతనము, ఇంద్రియనిగ్రహము, అణుచుట, అడుసు, శిక్ష, నిగ్రహము.
దమితుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దమ్యతే శిక్ష్యతే స్మ దమితః. శిక్షింపపడినవాడు, తపః క్లేశ సహనము కలవాడు, అణపపడినవాడు, పెంచపడినది, శిక్షింపపడినది.
దమునసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. దామ్యతి గ్లాపయతీతి దమునాః. గ్లానిని పొందించువాడు, అగ్నిహోత్రుడు.
దమ్యము
సం. నా. వా. అ. పుం. తత్స. దమనార్హో దమ్యః. శిక్షింపతగినది, మోయుటకు దున్నుటకు పనుపరుచతగిన వయస్సుకల కోడె, శిక్ష నీయము.
దయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దయంతే రక్షంత్యనయేతి దయా. దీని చేత రక్షింతురు, కృప కనికరము, కరుణ, జాలి.
దయాళువు
సం. విణ. ఉ. పుం. తత్స. దయతే తాచ్ఛీల్యేనేతి దయాళుః. రక్షించు స్వభావము కలవాడు, కనికరముకలవాడు, దయకలవాడు.
దయితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. విణ. దయతే చిత్తమాదత్త ఇతి దయితం. మనస్సునాకర్షించునది, ప్రియుడు, ఇష్టుడు.
దరము
సం. నా. వా. అ. పుం. న. తత్స. రసానుక్త్వాభావానాహ దరేతి దీర్యతే అస్మాదితి దరః. సాధువులను బాధించునది, భయము, గొయ్యి, వెరపు. దీర్యత ఇతి చదరః. త్రవ్వబడునది. దీర్యతే వక్షో అనేన దరః. సందేహము, శంకము, కొంచెము, గుహ.
దరి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దీర్యతే దరీ. భేదింపబడినది, గుహ.
దరిద్రుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దరిద్రాతి దుర్గతిం ప్రాప్నోతీతి దరిద్రః. దుర్గతిని పొందినవాడు, బీదవాడు. దరిద్రాతి దుర్గచ్ఛతీతి దరిద్రః. దీనుడు, పేద.
దర్దురము
సం. నా. వా. అ. పుం. తత్స. శబ్దేన కర్ణే దృణాతీతి దర్దురః. శబ్దము చేత చెవులను వ్రక్కలించునది, కప్ప, మబ్బు. దృణాతి కర్ణౌ శబ్దేనేతి దర్దురః. మేఘము, సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుర్గ.
దర్పకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దర్పయతీతి దర్పకః. గర్వింపచేయువాడు, మన్మధుడు, మరుడు. దర్పయతి హర్షయతి మోహయతి వేతీతి దర్పకః. కామదేవుడు.
దర్పణము
సం. నా. వా. అ. పుం. తత్స. దృప్యతే అనేన సువేషాభిమానా దితి దర్పణః. దీని చేత మంచి వేషాభిమానము వలన గర్వింతురు, అద్దము, ముకురము. దర్పయతి సందీపయతీతి దర్పణః. రూపమును చూసుకొనునది, దర్శనము, ఆదర్శము.
దర్భ
సం. నా. వా. అ. పుం. తత్స. దృణాతి కరాదికమితి దర్భః. కరాదులను చీల్చునది, తృణ విశేషము, కుశము. దృణాతి విదారయతీతి దర్భః. కాశము, పవిత్రతృణము, ధర్భఖండము, దర్భభేదము.
దర్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దృణాత్యన్నాదికమితి దర్వీ. అన్నము మొదలయిన దాని ఎనుపునది, మిల్లి, గరిటె, పాము యొక్క పడగ. దృణాతి విదారయత్యనేనేతి దర్వీ, ఒకజాతి కొంగ, తెడ్డు.
దర్వీకరము
సం. నా. వా. అ. పుం. తత్స. దర్వ్యాకారత్వాత్ఫణా దర్వీ, సైవ ప్రహరణాదౌ కరో అస్యేతి దర్వీకరః. తెడ్డు వంటి ఆకారము కలిగిన పడగ హస్తముగా కలిగినది, సర్పము, పాము. దర్వీం ఫణాం కరోతీతి దర్వీకరః. చక్రము వంచి మచ్చలుకల పాము, గొడుగు, స్వస్తికము, ఏనుగు తొండము చివరి అంగము.
దర్శనము
సం. నా. వా. అ. న. తత్స. దృష్టిర్దర్శనం. చూచుట, చూపు, కన్ను, అద్దము, బుద్ధి, తెలివి, కల, శాస్త్రము, ధర్మము. దృశ్యతే అనేనేతి దర్శనం. ఆలోకనము, వీక్షణము, ప్రత్యక్ష జ్ఞానము.
దర్శము
సం. నా. వా. అ. పుం. తత్స. దృశ్యేతే సూర్యచంద్రా వత్రేతి దర్శః. దీని యందు సూర్యచంద్రులు కూడుకొని ఎగపడుదురు, అమావాస్య. దర్శే విహితో యాగః దర్శః. అమావాస్య యందు చేయబడు యాగము, చూపు.
దళము
సం. నా. వా. అ. న. తత్స. దళతీతి దళం. పగులునది, ఆకు, దండు, హరిదళము, భాగము.
దవము
సం. నా. వా. అ. పుం. తత్స. దూయతే అనేనేతి దవః. తపింపచేయునది, కార్చిచ్చు, అడవి. దునోతి పీడయతీతి దవః. వనాగ్ని.
దవిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. అతిశయేన దూరం దవిష్ఠం. మిక్కిలి దూరమైనది, మిక్కిలి దవ్వైనది.
దవీయము
సం. విణ. (స్.ఈ.స్.). తత్స. అతిశయేన దూరం దవీయః. మిక్కిలి దూరమైనది.
దశ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దంశ్యంతే కంట కాదిభిరితి దశాః. ముండ్లు మొదలైన వానిచే పట్టబడునది, బద్దె. దశ్యతే ఛిద్యత ఇతి దశా. చెరపబడునది, అవస్ధ, పత్తి. దశతీవ దశా. అవస్థ, దీపపువత్తి, వయోవస్థ.
దశనము
సం. నా. వా. అ. పుం. తత్స. దంశంతిస్త్ర్య ధరమే భిరితి దశనాః. వీని చేత వనితిల అధరమును కొరుకుదురు, పల్లు, శిఖరము. దశ్యతే అనేనేతి దశనః. దంతము. సం. నా. వా. అ. న. తత్స. కవచము.
దశనావాసస్సు
సం. నా. వా. స్. న. తత్స. దశనాచ్ఛాదకత్వేన వాసస్సామ్యాద్దశనవాసః. దంతములకు వస్త్రమ వలె ఉండునది, పెదవి, పలువరుస.
దశబలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దశ బలాని బుద్ధ్యాదీని యస్యసః దశబలః. (బుద్ధి, క్షాంతి, వీర్యము, ధ్యానము, జ్ఞానము, కృప, శీలము, బలము, దానము, ఉపేక్ష అనెడు పది బలములు కలవాడు), బుద్ధ దేవుడు. దశషు దిక్షుబలం యస్య సః దశబలః.
దశమి
సం. నా. వా. న్. పుం. తత్స. నవతేరూర్ధ్వం దశమః అవస్ధావిశేషో అస్యాస్తీతి దశమీ. తొంభై ఏళ్ళ మీద పదవదైన అవస్ధావిశేషము కలవాడు, మిక్కిలి వృద్ధుడు. సం. నా. వా. . స్త్రీ. తత్స. పక్షములో 10 వతిధి. సం. విణ. తత్స. పదవది, ముదుసలి.
దశమీస్ధుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దశమ్యామవ స్ధాయాం తిష్ఠతీతి దశమీస్ధః. పదవఅవస్తయందుఉండువాడు, నష్టవీర్యుడు, వృద్ధుడు, ముసలి, అసమర్ధుడు, శవ భక్షకుడు.
దస్యుడు
సం. నా. వా. ఉ. పుం. తత్స. దస్యతి ఉపక్షయం కరోతీతి దస్యుః. ఉపక్షయమును చేయువాడు, శత్రువు. దస్యత్యుపక్షిణోతి కదాచిదితి దస్యుః. ఒకానొకప్పుడు చెడిపోవువాడు, దొంగ. దస్యతి పరస్వాన్ నాశయతీతి దస్యుః. రిపువు, బహిష్కృతుడు, కర్షకుడు, ఆయుధాజీవి.
దస్సులు
సం. నా. వా. అ. పుం. ద్వి. తత్స. దస్యతః క్షిపతో రోగానితి దస్రౌ. రోగములను క్షయింపచేయువారు, అశ్వినీ దేవతలు.
దహనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దహతీతి దహనః. దహించువాడు, అగ్ని. సం. విణ. తత్స. దుష్టుడు, వేడి, వేడికలది.
దాంతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. దమనం దాంతిః. ఓర్చుట, బ్రహ్మచర్యాది తపః క్లేశమునోర్చుతనము, వ్యసమగుట.
దాంతుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దామ్యతి ఇంద్రియేభ్య ఇతి దాంతః. ఇంద్రియముల వలన ఉపశమించువాడు, తపక్లేశము నోర్చువాడు. దమ్యతే శిక్ష్యతే స్మ దాంతః. శిక్షింపబడినవాడు, అడపబడినవాడు. దమ్యతీతి దాంతః. ఔషధీ విశేషము, స్వాధీనమైనది.
దాంభికుడు
సం. విణ. (అ.ఈ.అ.). తత్స. దంభము కలవాడు.
దాక్షాయణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దక్షస్యాపత్యం దాక్షాయణీ. దక్షుని కూతురు, పార్వతీ దేవి, రోహిణీ నక్షత్రము, అశ్విన్యాది నక్షత్రము, భూమి. దక్షస్యాపత్యం దాక్షాయణీ. దుర్గ.
దాక్షిణ్యుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దక్షిణాం అర్హతీతి దాక్షిణ్యః. దక్షిణ పుచ్చుకొన అర్హుడు, దక్షిణకు తగువాడు.
దాడిమ పుష్పకము
సం. నా. వా. అ. పుం. తత్స. దాడిమస్యేవ పుష్పాణ్యస్య దాడిమపుష్పకః. దాడిమ పువ్వుల వంటి పువ్వులు కలది, ములుమోదుగు చెట్టు.
దాడిమము
సం. నా. వా. అ. పుం. న. తత్స. పక్వావస్ధాయాం దళ్యతే దాడిమః. పక్వావస్ధ యందు వ్రక్కలౌనది, దానిమ్మచెట్టు, ఏలకి.
దాత్యూహము
సం. నా. వా. అ. పుం. తత్స. దాంతిం ప్లవనం ఊహతే దాత్యూహః. తేలుటను అభ్యసించునది, కూకురుగుండగి, వాన కోయిల, పక్షివిశేషము, నీటి కోడి.
దాత్రము
సం. నా. వా. అ. న. తత్స. దాతిభినత్త్యనేన దాత్రం. దీనితో కోయుదురు, కొడవలి, లవిత్రం. ద్యతి దాతి వానేనేతి దాత్రం. అస్త్రవిశేషము.
దానము
సం. నా. వా. అ. న. తత్స. ద్యతి ఖండయతీతి దానం. ఏనుగును పీడించునది, మదము, పాలనము, ఛేదనము, శుద్ధి. దీయతే దానం. ఇచ్చుట, ఈవి, (దశదానములు, గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, ఆజ్యదానము, వస్త్రదానము, ధాన్య దానము, గుడదానము, రౌప్యదానము, లవణదానము, షోడసమహదానములు, గోదానము, భూదానము, తిల, హిరణ్య, రత్న, విద్యా, కన్యా, దాసీ, శయ్యా, గృహ, అగ్రహార, రథ, గజ, అశ్వ, ఛాగ, మహీషీదానములు) 1. ఇది5విధములు.తనకుకలధనముఅంతాఇచ్చుట. 2. ఎక్కడ డబ్బు తీసుకుంటాడో అక్కడే కూలిగా ఉండుట. 3. అపూర్వవస్తువులను ఇచ్చుట. 4. ఒకరి ధనము పుచ్చుకొనిన ప్రవర్తింపచేయుట. 5. అప్పు తీర్చుట. చతురుపాయములలో ఒకటి, వితరణము, ప్రతిపాదనము, స్పర్శనము, ఇనాము.
దానవారి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దానవానామరయః దానవారయః. దానవులకు శత్రువు, దేవత, వేల్పు.
దానవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దనోర్జాతా దానవాః. దనువనెడి స్త్రీ వలన పుట్టినవారు, దనుజుడు, తొలువేల్పు. దనోరపత్యం దానవః. అసురుడు, రాక్షసుడు.
దానశౌండుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దానే శౌండస్సక్త ఇతి దానశౌండః. దానమందు ఆసక్తుడైనవాడు, మిక్కిలి ఈవి కాడు, వదాన్యుడు.
దాపితుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. రాజ్ఞా వివాదాస్పదీభూతం ధనం ధనినే దాప్యతే అస్మాదితి దాపితః. రాజుచేత వివాదాస్పదమైన ధనమును ధనస్వామి కొరకు ఇప్పించబడినవాడు, దండుగకొనపడినవాడు, సాధితుడు.
దామని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. బహుదామయోగాత్ దామనీ. పెక్కు తలుగులు కలది, దామెన త్రాడు, పశువులను కట్టుతాడు.
దామము
సం. నా. వా. న్. పుం. న. తత్స. ద్యతి పశుదౌష్ట్యమితి దామ. పసువుల పొగరుబోతు తనమును పోగొట్టునది, తలుగు, హారము. దీయతే ఇతి దామ. రజ్జువు.
దామోదరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ఉదరే దామయస్యేతి దామోదరః. ఉదరమందు తులసిమాలిక కలవాడు, విష్ణువు, వెన్నుడు. దమాదిసాధనేనోదారా ఉత్కృష్టామతిర్య, తయా గమ్యతే ప్రాప్యతే ఇతి దామోదరః. కృష్ణుడు.
దాయాదుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దాయం విభజనీయం ధనమత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః. పాలిసొమ్మును భుజించువాడు కాని, పుచ్చుకొనువాడు కాని దాయాదుడు, జ్ఞాతి, పుత్రుడు. ఆదత్తే ఇతి దాయాదః. సపిండుడు, కొడుకు.
దారదము
సం. నా. వా. అ. పుం. తత్స. దరదే నాగ విశేషే భవః దారదః. దరదమను పాము నుండి పుట్టినది, విషభేదము, పాదరసము, ఇంగువ. దరదే దేశవిశేషే భవః దారదః. సముద్రము, సింధుదేశము.
దారితము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దార్యతే స్మ దారితః. వ్రక్కలింపబడినది, చీల్చబడినది, బ్రద్ధలైనది, చిరిగినది.
దారుణము
సం. విణ. తత్స. దారయతి చిత్తమితి దారుణం. చిత్తమును భేదించునది, భయంకరము, కఠోరము, భయానకము.
దారువు
సం. నా. వా. ఉ. న. తత్స. కుఠారాది నాదీర్యత ఇతి దారు. గొడ్డలి మొదలైన వానిచే చీల్చబడునది, కొయ్య, దేవదారువు చెట్టు. దీర్యత ఇతి దారు. చీల్చబడునది, ఇత్తడి, దాత.
దారుహరిద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దారు సంబంధినీ హరిద్రా దారుహరిద్రా. మ్రాని సంబంధమైన పసుపు, కొమ్ముపసుపు.
దారుహస్తకము
సం. నా. వా. అ. పుం. తత్స. దారుమయీ హస్తప్రతికృతిః దారుహస్తకః. హస్తాకారమైన దారువు, కొయ్య తెడ్డు.
దార్వాఘాటము
సం. నా. వా. అ. పుం. తత్స. దార్వాహంతి దార్వాఘాటః. కొయ్యను తొలచునది, వడ్రంగి పిట్ట. దారు కాష్ఠం ఆహంతీతి దార్వాఘాటః.
దార్వి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దారు సంబంధినీ దార్వీ. దారు సంబంధమైన పసుపు, మ్రాని పసుపు, బెండ చెట్టు.
దార్విక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దారయతి రోగాన్ దార్వికా. రోగములను హరించునది, బెండ చెట్టు. దార్వీ హరిద్రాతస్యాః క్వాధోద్భవమంజనం దార్వికా. మ్రాని పసుపు పాకము వలన పుట్టిన అంజనము, కాటుక, మైలతుత్తము.
దావము
సం. నా. వా. అ. పుం. తత్స. దూయతే అనేనేతి దావః. తపింపచేయునది, కార్చిచ్చు, అడవి. దునోతి ఉపతాపయతీతి దావః. వనాగ్ని.
దావికము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దేవికాయాం భవో దావికః. దేవికా నది యందు పుట్టినది.
దాశపురము
సం. నా. వా. అ. న. తత్స. దశపురాఖ్యదేశే భవం దాశపురం. దశపుర దేశము నందు పుట్టినది, కయివడి ముస్తె చెట్టు.
దాశార్హుడు
సం. నా. వా. అ. పుం. తత్స. హరి, వెన్నుడు, విష్ణువు, కృష్ణుడు.
దాసి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దస్యతి క్షీయతే కాలేన దాసీ. కాలవశమున క్షయించునది, వెలకు కొన్న పనికత్తె, కాకి దొండ, నల్ల గోరంట. (వృక్ష విశేషము). దాసతి దదాత్యాత్మానమితి దాసీ.
దాసుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దంసయతే స్వామి కార్యాణి సావధానేనేతి దాసః. స్వామి కార్యములను సావధానముగా చూచువాడు, బంటు, వెలకు కొన్న పనివాడు, శూద్రుడు, జ్ఞాని, చేపలు పట్టువాడు, కింకరుడు, సేవకుడు, బానిస.
దాసేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దాస్యా అపత్యం దాసేయః. దాసీ పుత్రుడు, పనివాడు.
దాసేరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దాస్యా అపత్యం దాసేరః. దాసీ పుత్రుడు, పనివాడు.
దిగంబరుడు
సం. విణ. తత్స. దిక్ అంబరం యస్యేతి దిగంబరః. బయలే బట్టగా కలవాడు, దిసమొలవాడు. సం. నా. వా. అ. పుం. తత్స. శివుడు, భైరవుడు.
దిగ్ధము
సం. నా. వా. అ. పుం. తత్స. దిహ్యతే విషేణ దిగ్ధః. విషము చేత పూయబడునది, విషము పూసిన బాణము. సం. విణ. తత్స. దిహ్యతే స్మ దిగ్ధం. పూయబడినది, విషలిప్త బాణము, లిప్తము, పెరిగినది.
దితము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దీయతే స్మ దితం. కోయబడినది, నరకబడినది.
దితిసుతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దితేస్సుతాః దితిసుతాః. దితి కొడుకులు, దైత్యుడు.
దిధిషువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. దిధిషూమాత్మన ఇచ్ఛతీతి దిధిషుః. పునర్భువునిచ్ఛయించువాడు, మారుమనువు దాని మగడు. దిధిం ధైర్యం స్యతీతి దిధిషుః. పునర్వివాహిత యొక్క భర్త, అసంతృప్తి.
దిధిషువు
సం. నా. వా. ఊ.స్త్రీ. తత్స. పూర్వమేకేన ధృతా పునరన్యేన ధీయత ఇతి దిధిషూః. ముందొకని చేత ధరింపబడి మరల మరొకని చేత ధరింపబడునది, మారు మనువుది. దధాతి పాపం, యద్వా దిధిం ధైర్యం ఇంద్రియదౌర్బల్యాత్ స్యతి త్యజతీతి దిధిషూః. కనిష్ఠ భార్య, వివాహము చేసుకొన్న విధవ, పెండ్లియైన చెల్లెలుకల అనూఢ.
దినము
సం. నా. వా. అ. న. తత్స. ద్యతి అంధకారమితి దినం. అంధకారమును ఖండించునది, దివసము, పగలు. (దిన భాగములు పదిహేను- రౌద్రము, శ్వేతము, మైత్రము, శారభటము, సావిత్రము, విజయము, గాంధర్వము, కుతపము, రౌహిణేయము, విరించము, సోమము, నిరృతి, మహేంద్రము, వరుణము, భటము). ద్యతి ఖండయతి మహాకాలమితి దినం. కాలవిశేషము.
దినాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. దివస్య అంతః దినాంతః. దినము యొక్క అవసాన కాలము, సాయంకాలము, మాపు.
దివసము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దీవ్యంతి జనా అస్మిన్నితి దివసః. దీని యందు జనులు ప్రకాశింతురు, దినము, పగలు. దీవ్యంత్యత్రేతి దివసః.
దివస్పతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దివః పతిః దివస్పతిః. స్వర్గమునకు ప్రభువు, ఇంద్రుడు, వేల్పురేడు.
దివాంధము
సం. నా. వా. అ. పుం. తత్స. దివా అంధః దివాంధః. పగలు గుడ్డిగా ఉండునది, గుడ్లగూబ, ఘాకము.
దివాకరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దివా దినం కరోతీతి దివాకరః. దినమును చేయువాడు. దివా అహని ప్రాణిన శ్చేష్టావతః కరోతీతి దివాకరః. పగలు జీవులను వ్యాపారవంతులుగా చేయువాడు, సూర్యుడు, పగటివేల్పు.
దివాకీర్తి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దివైవకీర్త్యతే రాత్రౌ క్షురకర్మ నిషేధాదితి దివాకీర్తిః. రాత్రి క్షౌరము నిషిద్ధమవుట చేత పగలే పిలువబడువాడు, మంగలవాడు. దివసస్య పుణ్యకాలత్వాత్ దివా అకీర్తనమస్యేతి దివాకీర్తిః. పగలు పుణ్యకాలము కనుక అందుచ్ఛారము లేనివాడు, మాలవాడు, ఛండాలుడు.
దివాభీతము
సం. నా. వా. అ. పుం. తత్స. దివా భీతః దివాభీతః. పగలు భయపడునది, గుడ్లగూబ, కలువకొలను, దొంగ.
దివి
సం. నా. వా. వ్. స్త్రీ. తత్స. దీవ్యంత్యస్యామితి దివ్. ఇందు క్రీడింతురు, స్వర్గము. దివ్యతీతి దివ్. ప్రకాశించునది, ఆకాశము. సం. నా. వా. ఇ. పుం. తత్స. పాలపిట్ట.
దివిషదుడు
సం. నా. వా. ద్. పుం. తత్స. దివి సీదంతి వర్తంత ఇతి దివిషదః. స్వర్గము నందు ఉండువారు, దేవత, వేల్పు.
దివౌకసుడు
సం. నా. వా. స్. పుం. తత్స. దివ్ దివం వా ఓకః స్థానం యేషాం తే దివౌకసః. స్వర్గము స్థానముగా కలవారు, దివిషదుడు, వేల్పు, దేవత, పిచ్చుక.
దివ్యోపపాదుకుడు
సం. విణ. (అ.ఈ.అ.). తత్స. దివ్యాశ్చతే ఉపపాదుకాశ్చ దివ్యోపపాదుకాః. దివ్యులైన ఉపపాదుకులు దివ్యోపపాదుకులు, అయోనిసంభవదేవాది.
దిశ్యము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దిశి భవం దిశ్యం. దిక్కుల యందు పుట్టినది, లక్ష్యాభిముఖమైనది.
దిష్టము
సం. నా. వా. అ. పుం. తత్స. దిశ్యతే సుఖదుఃఖాది కమనేనేతి దిష్టః. దీని చేత సుఖదుఃఖాదులీయబడుచున్నవి, సమయము. దిశతీతి దిష్టః. కాలము, వార్త, బురదనీటిస్నానము.
దిష్టము
సం. నా. వా. అ.న. తత్స. దిశతి శుభాశుభమితి దిష్టం. శుభాశుభములను ఇచ్చునది, భాగ్యము, అదృష్టము.
దిష్టాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. దిష్టస్య జీవిత కాలస్య ప్రారబ్ధకర్మణో వా అంతః దిష్టాంతః. జీవిత కాలము యొక్క గాని ప్రారబ్ధకాలము యొక్క గాని అంతము. దిష్టస్య భాగస్య అంతో యత్ర దిష్టాంతః. చావు, మరణము.
దీక్షితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దీక్షా అస్య సంజాతా దీక్షితః. దీక్ష కలిగినవాడు, సోమముకల యజ్ఞము నందు దీక్ష వహించినవాడు.
దీదివి
సం. నా. వా. ఇ. పుం. న. తత్స. దీవ్యంత్యనేనేతి దీదివిః. దీని చేత ప్రకాశింతురు, వంటకము, అన్నము, బృహస్పతి, స్వర్గము, ఉప్పుడు బియ్యం.
దీధితి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. దీధీతే దీప్యత ఇతి దీధితిః. ప్రకాశించునది, కిరణము, వెలుగు.
దీనుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దీయత ఇతి దీనః. క్షయించువాడు, దరిద్రుడు, దర్పముదిగినవాడు, భయపడినవాడు, వృక్ష విశేషము, అనాదుడు.
దీపకము
సం. నా. వా. అ. పుం. తత్స. ఓమము, దీపము. సం. విణ. తత్స. వెలిగించునది. సం. నా. అ. న. తత్స. ఒక అర్థాలంకారము, వేటాడుడేగ, ప్రకాశము.
దీపము
సం. నా. వా. అ. పుం. తత్స. దీప్యతే అనేన దీపః. దీనిచే ప్రకాశింపచేయబడును, దీపము, దీపిక, తీగ, మయూర శిఖి చెట్టు, బయిరవాసము, దివ్వె.
దీప్తి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. దీప్యతే దీప్తిః. ప్రకాశింప చేయునది, కాంతి, వెలుగు, ప్రభ.
దీప్యము
సం. నా. వా. అ. పుం. తత్స. దీప్యతే అనేనేతి దీప్యః. దీనిచేత దీపనాగ్ని ప్రకాశింపచేయబడును, ఓమము, జీలకర్ర.
దీర్ఘకోశిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దీర్ఘకోశాతక్యాకారణత్వాత్ దీర్ఘకోశికా. నిడుపు బీరకాయ వంటి దేహము కలది, ఏనుగు జలగ, దుర్నామ, గుల్లపురుగు.
దీర్ఘదర్శి
సం. నా. వా. న్. పుం. తత్స. దీర్ఘం పశ్యతీతి దీర్ఘదర్శీ. దూరమైన అర్థములను బుద్ధితో చూచువాడు, విద్వాంసుడు, గ్రద్ద. సం. విణ. తత్స. దూరపు ఆలోచన కలవాడు, పండితుడు.
దీర్ఘదేహి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దీర్ఘో దేహో అస్యా ఇతి దీర్ఘదేహీ. నిడుపైన శరీరము కలది, పందికొక్కు, మూషికము.
దీర్ఘనిద్ర
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దీర్ఘానిద్రేతి దీర్ఘనిద్రా. చావు, పెద్ద నిదుర, మృత్యువు, మరణము.
దీర్ఘపృష్ఠము
సం. నా. వా. అ. పుం. తత్స. దీర్ఘం పృష్ఠం అస్యేతి దీర్ఘపృష్ఠః. దీర్ఘమైన వీపు కలిగినది, సర్పము, పాము. దీర్ఘం ఆయతం పృష్ఠం యస్య సః దీర్ఘపృష్ఠః.
దీర్ఘము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దృణాతి దూరస్థితత్వాదితి దీర్ఘం. దవ్వున ఉనికిచేత పీడించునది, నిడుద, ఆయతము, పొడవైనది.
దీర్ఘవృంతము
సం. నా. వా. అ. పుం. తత్స. దీర్ఘం వృంతమస్య దీర్ఘవృంతః. నిడుపైన తొడిమ కలది, దుండిగవు చెట్టు, ఒక జాతి చెట్టు.
దీర్ఘసూత్రుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దీర్ఘం సూత్రం విచారో అస్యేతి దీర్ఘసూత్రః. దీర్ఘేణ బహుకాలేన సూత్రం కార్యారంభో యస్య సః దీర్ఘసూత్రః. చిరక్రియ, అలసుడు.
దీర్ఘిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దీర్ఘైవ దీర్ఘికా. దీర్ఘమైనది, నడబావి, దిగుడుబావి.
దుంగ్ధిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుద్ధమస్యా ఇతి దుగ్ధికా. పాలుకలది, చిరుపాలచెట్టు.
దుందుభి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దుందుశబ్దేన భాతీతి దుందుభిః. దుందువను శబ్దము చేత ప్రకాశించునది, భేరి, వరుణుడు, ఒక సంవత్సరం, ఒకానొక రాక్షసుడు. సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పాచిక అందలి ఇత్తిక, వాద్య విశేషము.
దుఃఖము
సం. నా. వా. అ. న. తత్స. దుర్నిందితం ఖనతి వా దుఃఖం. దుష్టముగా ఖేదపెట్టునది, బాధ, వ్యధ, నొగులు. దర్దుష్టం ఖనతీతి దుఃఖం. పీడ, బాధ, కష్టము, ఆర్తి, పీడితము, దురదృష్టము, అదృష్టహీనత.
దుకూలము
సం. నా. వా. అ. న. తత్స. ప్రావారోత్తరా సంగరూపేణ ద్విధాకూల్యత ఇతి దుకూలం. కట్టుకొనుటకు మీదవేసుకొనుటకు రెండు విధములుగా కప్పబడునది, తెల్లవస్త్రము, సన్నవస్త్రము. దుష్టం కూలాత ఇతి ఆవృణోతీతి దుకూలం. సూక్ష్మవస్త్రము, పట్టుబట్ట.
దుగ్ధము
సం. నా. వా. అ. న. తత్స. దుహ్యత ఇతి దుగ్ధం. పితకబడునది, పాలు, క్షీరము, పీయూషము.
దురధ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. దుష్టో అధ్వాదురధ్వః. చెడ్డ త్రోవ, కరధ్వము, కుమార్గము.
దురాలభ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుఃఖేన లభ్యతే స్పృశ్యత ఇతి దురాలభా. ప్రయాసముచే తాకబడునది, తీటక సిందచెట్టు. సం. విణ. లభింపనిది.
దురితము
సం. నా. వా. అ. న. తత్స. దుః నిందితం ఇతం గమనం. అస్య దురితం. నిందితమైన నడత కలిగినది, పాపము, కలుచు.
దురోదరము
సం. నా. వా. అ. న. తత్స. దుష్టమాసమంతాదుదర మస్యేతి దురోదరః జూదము, పందెము, అంతట దుష్టమైన ఉదరము కలవాడు.
దుర్గ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుఃఖేన గంతుం శక్యతే దుర్గా. కష్టముచే ఎరుగతగినది, పార్వతి, నల్ల పిచ్చుక, చెట్టు. దుర్దుఃఖేన గమ్యతే ప్రాప్యతే అసౌ ఇతి దుర్గా. రుద్రాణి, కాత్యాయిని, అపర్ణ, అంబిక, కుమారి.
దుర్గం
సం. నా. వా. అ. న. తత్స. దుఃఖేన గమ్యత ఇతి దుర్గం. ప్రయూసము చేత పొందబడునది, కోట, రాజ్యము, అడవి, నరకము, నగరము, దుర్గమము.
దుర్గంధము
సం. నా. వా. అ. పుం. తత్స. దుర్గంధో అస్యాస్తీతి దుర్గంధః. దుష్టమైన గంధము కలది, గబ్బు, తెల్ల ఉప్పు, చెడువాసన.
దుర్గతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. దుష్టాగతిః దుర్గతిః. దుష్టమైన గతి, నరకము, బీదతనము. దుష్చా క్లేశదాయినీ గతిరితి దుర్గతిః. దారిద్ర్యము.
దుర్గతుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దురవస్థానం గతో దుర్గతః. దురవస్థను పొందినవాడు, దరిద్రుడు, బీద. దుర్ దురవస్థాం గచ్ఛతిస్మేతి దుర్గతః. దీనుడు.
దుర్గమము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దుష్టోగమో యస్య తద్దుర్గమం. దుష్టమైన గమనము కలిగినది, పోకూడనిది, పొందకూడనిది, కొండ.
దుర్జనుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దుష్టో జనః దుర్జనః. దుష్టుడయిన జనుడు, దుష్టుడు, చెడ్డవారు, కపటి.
దుర్దినము
సం. నా. వా. అ. న. తత్స. దుష్టం దినం దుర్దినం. దుష్టమైన దినము, మబ్బు కమ్మిన దినము, ముసరు ప్రొద్దు, చెడుదినము, మేఘావృతమైనపగలు.
దుర్నామ
సం. నా. వా. న్. పుం. తత్స. దుష్టంనామ నమనమస్యాదుర్నామా గుల్లపురుగు, మూలవ్యాధి. దుర్నిందితం నామ అస్యా ఇతి దుర్నామా. దుష్టమైన నామము కలది, ఏనుగు జలగ.
దుర్బలుడు
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దుర్నిందింతం బలమస్య దుర్బలః. నిందితమైన బలము కలవాడు, బక్కవాడు, బలహీనుడు, చిక్కినవాడు.
దుర్ముఖుడు
సం. విణ. తత్స. దుష్టం ముఖం వచనమస్యేతి దుర్ముఖః. అప్రియమైన మాటలు కలవాడు, అసంబద్ధ వచనములు ఆడువాడు. దుర్దుఃఖజనకం ముఖం ముఖనిఃసృతవచనాదికం యస్యేతి దుర్ముఖః. వానరవిశేషము, అశ్వము, గుర్రము, సర్పము, పాము.
దుర్వర్ణము
సం. నా. వా. అ. న. తత్స. కనకాపేక్షయా నికృష్టవర్ణత్వాదుర్వర్ణం. బంగారము కంటె నీచమైన వర్ణము కలది, వెండి, నూగుదోశ. సం. విణ. తత్స. చెడ్డవర్ణముకలది.
దుర్విధుడు
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దుష్టాజీర్ణ వస్త్రధారణ కదన్న భోజనాదిరూపావిధా ప్రకారోయస్యేతి దుర్విధః. చినిగిన గుడ్డ కట్టుకొనుట, కుత్సితమైన అన్నము భుజించుట మొదలైన ప్రకారము కలవాడు, దరిద్రుడు, దుర్జనుడు. దుర్దుష్టా విధా యస్యోతి దుర్విధః. మూర్ఖుడు, పేదలు, హీనుడు.
దుర్హృదుడు
సం. నా. వా. ద్. పుం. తత్స. దుష్టం హృదయమస్య దుర్హృద్. దుష్టమైన హృదయము కలవాడు, పగవాడు, శత్రువు.
దుశ్చ్యవనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దుస్సహశ్చ్యవనో నామ మునిర్యస్య స దుశ్చ్యవనః. ఇంద్రుడు. దుర్దుఃఖేన చ్యవనం బహుకాలానంతరం పతనం యస్య సః దుశ్చ్యవనః.
దుష్కృతము
సం. నా. వా. అ. న. తత్స. దుర్నిందితం కృతం కరణమస్య దుష్కృతం. నిందితమైన కార్యము కలది, పాపము. సం. విణ. తత్స. దుష్టముగా చేయబడినది.
దుష్పత్రము
సం. నా. వా. అ. పుం. తత్స. దుష్టాని పత్రాణ్యస్య దుష్పత్రః. దుష్టమైన ఆకులుకలది, నల్లకచోరము, బలురక్కెస. (వృక్ష విశేషము).
దుష్ప్రధర్షిణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. కంటకైః దుఃఖేన ప్రధృష్యత ఇతి దుష్ప్రధర్షిణీ. ముండ్ల చేత ప్రయాసమున పట్టుకొనబడునది, ములక చెట్టు, వంకాయ.
దుహిత
సం. నా. వా. ఋ. స్త్రీ. తత్స. దోగ్ధి వివాహ దికాలే ధనాదికామాకృష్య గృహ్ణాతీతి దుహితా. కూతురు, కన్య, తనుజ.
దూతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దూయతే స్త్రీ వా పుమాన్ వా అనయేతి దూతీ. దీనిచేత స్త్రీ గాని పురుషుడుగా అన్యోన్య విషయమై పరితపింపచేయబడును, కుంటెనకత్తె, దూతిక, వార్తాహరిని.
దూతుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దూయతే అనేనే పర ఇతి దూతః. వీని చేత శత్రువు తపింపచేయబడును, రాయబారి, కుంటెనకాడు, శుక్రుడు, వార్తాహరుడు.
దూత్యము
సం. నా. వా. అ. న. తత్స. దూతస్య భావః కర్మవా దూత్యం. దూత యొక్క భావము, క్రియ, దూత కర్మము, దూత స్వభావము.
దూనము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దూయతే స్మ దూనః. తపింపచేయబడినది, సంతాపితము, బాధను అనుభవించుచున్నవాడు.
దూరదర్శి
సం. నా. వా. న్. పుం. తత్స. అప్రత్యక్షమపి ఊహేన పశ్యతీతి దూరదర్శీ. ప్రత్యక్షము కాని దూరమైన అర్థములను బుద్ధిచేత చూచువాడు, విద్వాంసుడు, గద్ద. సం. విణ. తత్స. దూరపు ఆలోచనకలవాడు, పండితుడు.
దూరము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. దుఃఖేన ఈయతే ప్రాప్యత ఇతి దూరం. ప్రయాసచేత పొందబడునది, దవ్వు, దగ్గరకానిది.
దూర్వ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దూర్వ్యతే పశుభిరితి దూర్వా. పశువులచే పీకబడునది, గరిక (వృక్ష విశేషము), భార్గవి, పచ్చనిది, వంగిన పచ్చిగడ్డి.
దూషిక
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. నేత్రే దూషయతీతి దూషికా. కన్నులను వికృతముగా చేయునది, కంటిపుసి, వాగర, సాలెపురుగు, క్రోధవివసురాలు, ఒక కంటిజబ్బు.
దూష్య
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దూయతే అనయా దూష్యా. దీనిచేత తపింపచేయబడును, ఏనుగునడుముకుకట్టెడు తోలుమోపు.
దూష్యము
సం. నా. వా. అ. న. తత్స. దూష్యతే స్వతో బహిర్దేశో అనేనేతి దూష్యం. తన కంటె వెలుపలి ప్రదేశము దీనిచేత దూషింపబడును, గుడారము, వస్త్రము. సం. విణ. తత్స. దూషింపతగినది, చీము.
దృతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దృణాతీతి దృతిః. తిత్తి, భస్త్ర, కొలిమితిత్తి.
దృబ్ధము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. దృభ్యతే స్త దృబ్ధం. కూర్పబడునది, గ్రువ్వబడునది.
దృషత్తు
సం. నా. వా. ద్. స్త్రీ. తత్స. దృణాతీతి దృషత్. హింసించునది,రాయి, సన్నెకల్లు.
దృష్టము
సం. నా. వా. అ. న. తత్స. దృశ్యత ఇతి దృష్టం. కానబడునది, రాజునకు తన బలము వలనను, పగవారి వలన పుట్టిన భయము, రాజునకుస్వ, పరసేనలవలన కలిగిన భయము. సం. విణ. తత్స. చూడబడినది.
దృష్టరజ
సం. నా. వా. స్. స్త్రీ. తత్స. దృష్టం రజో అస్యా ఇతి దృష్టరజాః. కానంబడిన రజస్సు కలిగినది, సమర్తాడిన పడుచు.
దృష్టాంతము
సం. నా. వా. అ. పుం. తత్స. దృష్టః అంతో నిశ్చయో యత్ర దృష్టాంతః. చూడబడిన నిశ్చయము కలది, ఉదాహరణము, ఒక అర్ధాలంకారము, శాస్త్రము, చావు.
దృష్టి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. పశ్యంతి అనయా దృష్టిః. దీనిచేత చూచుదురు, చూపు, కన్ను. దృశ్యతే అనయా దర్శనం చేతి దృష్టిః. దీని చేత చూడబడును, బుద్ధి.
దేవకము
సం. నా. వా. అ. పుం. తత్స. దీవ్యం తేభిరిది దేవకః. దీనిచేత క్రీడింతురు, పాచిక, అక్షము.
దేవకము
సం. నా. వా. అ. పుం. తత్స. దీవ్యంత్యే భిరితి దేవకాః. వీని చేత క్రీడింతురు, పాచిక, అక్షము.
దేవకీనందనుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవక్యాః నందనః దేవకీనందనః. దేవకీ దేవి కుమారుడు, కృష్ణుడు.
దేవకుసుమము
సం. నా. వా. అ. న. తత్స. దేవానాం ప్రియం కుసుమం దేవకుసుమం. దేవతలకు ప్రియమైనది, లవంగము.
దేవఖాతకము
సం. నా. వా. అ. న. తత్స. దేవైః ఖన్యత ఇతి దేవఖాతం. దేవతల చేత త్రవ్వబడినది, అఖాతము, సహజమైన జలాశయము.
దేవచ్ఛందము
సం. నా. వా. అ. పుం. తత్స. దేవానపి చందయతి ఆహ్లాదయతి దేవచ్ఛందః. దేవతలను సైతం ఆహ్లాదపెట్టునది, నూరు పేటల హారము. దేవైశ్ఛంద్యతే ఆకాంక్ష్యతే ఇతి దేవచ్ఛందః. 108 పేటల రత్నాహారము.
దేవజగ్ధకము
సం. నా. వా. అ. న. తత్స. దేవేన అగ్నినాజగ్ధం దేవదగ్ధం. అగ్నిచేత భక్షింపబడునది, కామంచి గడ్డి, సువాసనకల తృణ విశేషము.
దేవత
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దేవా ఏవ దేవతాః. దేవులే దేవతలు, వేలుపు, దేవుడు, త్రిదివేశులు.
దేవతరువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. కల్ప వృక్షము, వేల్పుచెట్టు, దేవతల5 వృక్షములు.
దేవతాళము
సం. నా. వా. అ. పుం. తత్స. దేవం ఇంద్రియం తాడయతీతి దేవతాళః. ఇంద్రియమును పీడించునది, డావర డంగి చెట్టు.
దేవదత్తము
సం. నా. వా. అ. పుం. తత్స. ఒక ఉపవాయువు, అర్జునుని శంఖము.
దేవదారువు
సం. నా. వా. ఉ. పుం. తత్స. దేవానాం దారు దేవదారు. దేవతల యొక్క వృక్షము, ఒకానొక వృక్షము.
దేవద్య్రక్కు
సం. విణ. (చ్.ఈ.చ్.). తత్స. దేవాన్ అంచతి గచ్ఛతి పూజయతీతివా దేవద్య్రజ్. దేవతలను గూర్చి పోవువాడు, దేవపూజకుడు.
దేవనము
సం. నా. వా. అ. న. తత్స. ద్యూతి ర్దేవనం. క్రీడించుట, జూదము, గెలువనిచ్ఛ, వ్యవహారము.
దేవభూయము
సం. నా. వా. అ. న. తత్స. దేవత్వము.
దేవమాతృకము
సం. విణ.(అ.ఆ.అ). తత్స. దేవః మాతాస్య దేవమాతృకః. పర్జన్యుడే తల్లిగా కలది, వాన నీరుచేత పండెడు పైరుకల దేశము. దేవో వృష్టిర్మాతేవ సస్యోత్పాదనేన పాలకత్వాత్ జననీవ యస్యేతి దేవమాతృకః.
దేవరుడు
సం. నా. వా. అ. పుం. తత్స. భ్రాతృజాయాభిస్సహ పరిహాసేన దీవ్యతి క్రీడతే దేవరః. అన్నదమ్ముల భార్యలతో పరిహాసముచే క్రీడించువాడు, మగనితోబుట్టువు, మరిది. దీవ్యత్యనేనేతి దేవరః.
దేవలుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవాన్ లాతి పూజార్ధమితి దేవలః. పూజించు నిమిత్తమై దేవరను స్వీకరించువాడు, తంబళవాడు, నంబివాడు, పూజారి.
దేవవల్లభము
సం. నా. వా. అ. పుం. తత్స. దేవానాం వల్లభః దేవవల్లభః. దేవతలకు ప్రియమైనది, పొన్న చెట్టు.
దేవాజీవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దేవేన జీవతీతి దేవాజీవః. దేవరచేత బ్రతుకువాడు, దేవలుడు.
దేవి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. దీవ్యతీతి దేవీ. క్రీడించునది, రాణి, పార్వతి, దుర్గ. దేవపుత్రీ సంజ్ఞకత్వాద్దేవీ. దేవపుత్రి అను పేరు కలది, చాగ చెట్టు, పిక్క చెట్టు, పీలు వృక్షము, మద్యము, నాటకములో రాజు పట్ట మహిషి.
దేవుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దివ్యంతీతి దేవాః. క్రీడించువారు, దేవత, వేలుపు. దీవ్యతి ఆనందేన క్రీడతీతి దేవః. విష్ణువు, కత్తి, నాటకములోని రాజు, పూజ్యుడు.
దేవృడు
సం. నా. వా. ఋ. పుం. తత్స. భ్రాతృజాయాభిస్సహ పరిహాసేన దీవ్యతి క్రీడతే దేవా. అన్నదమ్ముల భార్యలతో పరిహాసముచే క్రీడించువాడు, దేవరుడు, మరిది.
దేశము
సం. నా. వా. అ. పుం. తత్స. దిశ్యత ఇతి దేశః. ఇయ్యబడునది, అనేక పట్టణములుకలగొప్పభూభాగము, విలాతి. దిశ్యతే నిర్దిశ్యతే ఇతి దేశః. జనపదము, విషయము, రాష్ట్రము, మాగాణాము, నాడు, దేశములు (అంగ, వంగ, కళింగ, కర్ణాటక, కేరళ, కామరూప, గౌడ, వనవాస, కుంతల, కొంకణ, మగధ, సురాష్ట్ర, మాళవ, లాట, భోట, వరాట, శబర, కుకుర, కురువ, అవంతి, పాండ్య, మధ్ర, సింహళ, ఘార్జర, పారశీక, మిథిల, పాంచాల, శూరసేన, గాంధార, బాహ్లిక, హైహయ, తౌళవ, సాళ్వ, పుండ్రుక, ప్రాగ్జ్యోతిష, మత్స్య, చేది, బర్బర, నేపాల, గౌళ, కాశ్మీర, కన్యాకుబ్జ, విదర్భ, ఖురసాణ, మహరాష్ట్ర కోసల, కేకయ, అహిచ్ఛత్ర, త్రిలింగ, ప్రయాగ, కరహాటక, కాంభోజ, భోజ, చోళ, వాణ, కాశి) చాలా దేశములుకలవు కాని ఇవి ముఖ్యమైన దేశములు.
దేశరూపము
సం. నా. వా. అ. న. తత్స. దిశ్యమానస్యోచితస్య రూపం దేశరూపం. తనుకు ఉచితమైన ధర్మమునకు అనురూపమైనది, న్యాయము, పాడి, అర్హత.
దేహము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దిహ్యతే అన్నరనేనేతి దేహః. అన్నరసాదులచేత వృద్ధి పొందింపబడునది, శరరీరము, మేనువు. దేగ్ధి ప్రతిదినమితి దేహః. శరీరము.
దేహళి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. సుధాదినా దిహ్యత ఇతి దేహళీ. సున్నము మొదలైన వాని చేత పూయబడునది, గడప. దేహం లేపం లాతీతి దేహళీ, నల్లివాసన, గుమ్మము.
దైతేయుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దితేరపత్యాని దైతేయః. దితి కొడుకులు, తొలువేల్పు. దితేరపత్యం పుమానితి దైతేయః. అసురులు, రాక్షసుడు.
దైత్యారి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దైత్యానామరిః దైత్యారిః. దైత్యులకు శత్రువు, విష్ణువు, వేలుపు. దైత్యానాం అసురాణాం అరిః శత్రుః ఇతి దైత్యారిః. దేవతలు, మరువము.
దైత్యుడు
సం. నా. వా. అ . పుం. తత్స. దితేరపత్యాని దైత్యః. దితి కొడుకులు, తొలువేల్పు, అసురులు, తాడిచెట్టు, వీరణ తృణమూలము.
దైర్ఘ్యము
సం. నా. వా. అ. న. తత్స. దీర్ఘస్య భావో దైర్ఘ్యం. దీర్ఘ వస్తువు యొక్క భావము, నిడువు, పొడవు.
దైవజ్ఞ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దైవం శుభాశుభం జానాతీతి దైవజ్ఞా. శుభాశుభములు తెలిసినది, సోదెకత్తె, బల్లి.
దైవజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దైవం శుభాశుభం జానాతీతి దైవజ్ఞః. శుభాశుభములు తెలిసినవాడు, జోస్యుడు, గణకుడు.
దైవము
సం. నా. వా. అ. న. తత్స. దేవః పరమేశ్వరః తత్ర భవం దైవం. పరమేశ్వరుని అందు పుట్టినది, అదృష్టము. దేవానామిదం దైవం. దేవతల సంబంధమైన తీర్ధము. దేవాంత్ నియతాదాగతం ఇతి దైవం.
దోష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. దుష్యత్యత్రేతి దోషా. భుజము, రాత్రి, సం. నా. వా. అ. పుం. తత్స. తప్పు, పాపము, (కావ్యదోషములు, మూడు విధాలు, పద, వాక్య, అర్ధ దోషములు). అందు పదదోషములు అప్రయుక్తము అపుష్టారార్ధము, అసమర్ధము, నినర్దకము, నేయూర్థము, చ్యుతసంస్కారము, సంధిగ్ధము, అప్రయోజకము, క్లిష్టము, గూడార్ధకము, గ్రామ్యము, అన్యార్థము, అప్రతీతికము, అడి మృష్ట విధేయాంశము, విరుద్ధమతిరకము, అశీలము, పరుషము, వాక్యదోషములు, శబ్దహీనము, క్రమభ్రష్ఠము, విసంధి, పునరుక్తియుతము, వ్యాకీర్ణము, వాక్యసంకీర్ణము, అపూర్ణము, వాక్య గర్భితము, భిన్నలింగము, భిన్నవచనము, న్యూనోపమము, అధికోపమము, భగ్నచ్ఛందము, యతిభ్రష్ఠము, ఆశరీరము, అరీతికము, విసర్గలుక్తము, ఆస్థానసమాసము, వాచ్యవర్చితము, సమాప్త పునరాక్తము, సంబంధవర్చితము, పతత్ర్పకర్షణము, అధికపదము, పక్రమవంగము, అర్ధదోషములు, అపార్ధము, వ్యర్ధము, ఏకార్ధము, ససంశయము, అపక్రమము, భిన్నము, అతిమాత్రము, పరుషము, విరసము, హీనోపమము, అధికోపమము, అసమోపవము, అప్రసిద్ధోమోపవము, హేతుశూన్యము, నిరలంకృతి, అశ్లీలము, విరుద్ధము, సహచరచ్యుతము.
దోషజ్ఞుడు
సం. నా. వా. అ. పుం. తత్స. దోషం జానాతీతి దోషజ్ఞః. సం. విణ. తత్స. రోగనిర్దారణమున దోషమును ఎరిగినవాడు, విద్వాంసుడు, వైద్యుడు, సమర్ధుడు, పండితుడు.
దోహదము
సం. నా. వా. అ. పుం, న. తత్స. దోహః పూర్తిః తం దదాతీతి దోహదం. పూర్తినిచ్చునది, ఇచ్ఛ, గర్భిణికి కల వేవిళ్ళు, ఎరువు, తరుగుల్మలతాదులకు అకాలము నందు పుష్పాదులను పుట్టించెడు స్త్రీలపాదతాడనాది క్రియ. దోహమాకర్ష దదాతీతి దోహదః. శ్రద్ధ. (అశోకమునుకు దోహదము పాద తాడనము, పొగడకు ముఖసీధువు, గోరంటకు ఆలింగనము, బొట్టుగునకు వీక్షణము, మామిడికి కరస్పర్శనము, సంపెఁగకు ముఖరాగము, కొండగోఁగునకు సల్లాపము, వావిలికి ఊర్పు, మోరటికి పాట, సురపొన్నకు నవ్వు).
దోహదవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. వేవిళ్ళుకల ఆడది.
ద్యావాపృధువులు
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. మిన్ను మన్ను, భూమి, ఆకాశము.
ద్యుతి
సం. నా. వా. ఇ. స్త్రీ. తత్స. ద్యోత ఇతి ద్యుతిః. ప్రకాశించునది, కాంతి, వెలుగు, శోభ, కిరణము, దీప్తి.
ద్యుమణి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దివః ఆకాశస్య మణిః ద్యుమణిః. ఆకాశమునకు మణి వంటివాడు, సూర్యుడు.
ద్యుమ్నము
సం. నా. వా. అ. న. తత్స. దివిమ్నాయత ఇతి ద్యుమ్నం. స్వర్గమందు కోరబడునది. ద్యూయతే అభిగమ్యత ఇతి ద్యుమ్నం. పొందబడునది, ధనము, బలము. ద్యుమగ్నిం మనతి అభ్యసత్యస్మై ఇతి ద్యుమ్నం. అన్నము, ధైర్యము.
ద్యూతము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దేవనం ద్యూతః. క్రీడించుట ద్యూతము, జూదము.
ద్యోతము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్యోతతే ద్యోతః. ప్రకాశించునది, ఎండ, కాంతి.
ద్రప్సము
సం. నా. వా. అ. న. తత్స. ద్రవతీతి ద్రప్సం. ద్రవ రూపమైనది, నీళ్ళు కలిపిన పెరుగు. దృప్యంత్యనేన ద్రప్సం, నీటి బిందువు.
ద్రవంతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ద్రవతి విగళతీతి ద్రవంతీ. ద్రవరూపమై ఉండునది, ఎలుక జీడి.
ద్రవము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్రవతి చిత్తమనేన ద్రవః. దీనిచేత మనస్సు కరుగును, తడి, పరిహాసము. ప్రద్రవణం ద్రవః. పారి పోవుట, పరుగు, యుద్ధము వలన పారుట, పరిహాసము, పలాయనము, ఒక వృక్షము.
ద్రవిణము
సం. నా. వా. అ. న. తత్స. ద్రవత్యనేన శత్రుంప్రతి ద్రవిణం. దీని చేత శత్రువును కూర్చి పోవును, బలము. ద్రవతి గచ్ఛతీతి ద్రవిణం. వెచ్చపోవునది, ధనము, బంగారము. ద్రవంత్యనేన, ద్రవతీతి చ ద్రవిణం. దీనిచేత యుద్ధాదులకు పోవుదురు, కరుగునది, బలము. ద్రవతి గచ్ఛతి ద్రూయతే ప్రాప్యతే వేతీతి ద్రవిణం. బలము, కాంచనము, బంగారము, నవగ్రహమును యజ్ఞపాత్ర.
ద్రవ్యము
సం. నా. వా. అ. న. తత్స. ద్రవణీయమితి ద్రవ్యం. పొందతగనది, ధనము, పృధివ్యాది(ఇవి తొమ్మిది. పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు.), ఇత్తడి, పూత, మందు, విలేపనము, భవ్యము, రూపరసాదులకు ఆధారమైనది. సం. విణ. తత్స. దృవికారము.
ద్రాక్ష
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ద్రాతి దాహాదికం ద్రాక్షా. దాహాదికమును పోగొట్టునది, ఒకానొక తీగ, దాకచెట్టు. ద్రాంక్ష్యతే కాంక్ష్యతే ఇతి ద్రాక్షా. ఫలవిశేషము, అంగూర, నల్లజీడి.
ద్రాఘిష్ఠము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. అతిశయేన దీర్ఘః ద్రాఘిష్ఠః. మిక్కిలి దీర్ఘమైనది.
ద్రావిడము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్రావయతి రోగాన్ ద్రావిడకః. రోగములను సంహరించునది, కచోరపు చెట్టు, ద్రావిడభాష, ద్రావిడికము.
ద్రుఘణము
సం. నా. వా. అ. పుం. తత్స. దుః వృక్షో హన్యతే అనేనేతి ద్రుఘణః. వృక్షము దీని చేత కొట్టబడును, ఇనుప గుదియ, గండ్ర గొడ్డలి, బ్రాహ్మణుడు, కొయ్యసుత్తి.
ద్రుతము
సం. క్రి. విణ. అ. న. తత్స. ద్రవంత్యనేనేతి ద్రుతం. దీని చేత పరిగెత్తుదురు, వడికలది, త్వరితము. ద్రవంతి త్వరంతే కరణచరణాదయో అత్ర ద్రుతం. దీని యందు కరచరణాదులు త్వరితమై ఉండును, త్వరితము. ద్రూయతే స్మ ద్రుతం. కరగినది. విద్రవతీతి ద్రుతం. కరగినది. సం. విణ. తత్స. వడికలిగినది, పలుచనది, వేగము, తొందర, వేగముగా పోవుట, చిరిగినది.
ద్రుమము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్రుః వృక్షావయవో అస్య ద్రుమః. శాఖ కలిగినది, వృక్షము, పారిజాత వృక్షము. సముదాయే వృత్తాః శబ్దా అవయవేష్వపి వర్తంతే ఇతి న్యాయాద్ ద్రుః శాఖా విద్యతే అస్యేతి ద్రుమః.
ద్రుమామయము
సం. నా. వా. అ. పుం. తత్స. నిర్యాసత్వాత్ ద్రుమాణాం ఆమయః ద్రుమామయః. వృక్షముల యొక్క బంక, లక్క, లాక్ష.
ద్రుమోత్పలము
సం. నా. వా. అ. పుం. తత్స. అస్య ద్రుమస్య ఉత్పలానీవ పుష్పాణీతి ద్రుమోత్పలః. ఈ వృక్షమునకు కలువల వంటి పువ్వులు కలవు, కొండగోగు చెట్టు.
ద్రువయము
సం. నా. వా. అ. న. తత్స. ద్రోర్వృక్షస్య వికారః ద్రువయం. దీని చేత కొలువబడును, త్రాసు, మూర, తూకము లోని మానము, కుంచము మొదలుగునవి. కొలత సాధనములు.
ద్రుహిణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్రుహ్యతి హింసత్యసురేభ్యో ద్రుహిణః. అసురులకు హింసచేయువాడు, బ్రహ్మ. ద్రుహ్యతి దుష్టేభ్యః ఇతి ద్రుహిణః. బ్రహ్మ, హరి.
ద్రోణము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ద్రుణతీతి ద్రోణః. హింసించునది, తేలు, ఎర్రతేలు, తుమ్మికూర. ద్రవతి ధాన్యపరిమాణాయ సర్వతో గచ్ఛతీతి ద్రోణః. ధాన్యమును కొలుచుటకు అన్ని దిక్కులు పోవునది, ఒకానొక కొండ, మాలకాకి. ద్రోణః కలస ఉత్పత్తిస్థానత్వేనాస్త్యస్య ఇతి ద్రోణః. పక్షివిశేషము, నాలుగు రాశులు లేక రెండు సేహికలు. 4 అడ్డలు, కుంచము, కొలత, కర్రతోచేసిన పాత్ర.
ద్రోణి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ద్రవత్యస్యాం జలమితి ద్రోణీ. దీనియందు జలము కారిపోవును, చిన్న ఓడ, జలగడుగు వాని విశేషము. ద్రవంత్యస్యాః జనాః అస్పృశ్యత్వాత్ ద్రోణీ. అస్పృశ్యమవుట చేత సుజనులు దీనిని చేరక పారిపోవుదురు, పశువులు మేయు కంచె, కొండపల్లము, దొన్నె, అరిణ, దేశవిశేషము, నీలిచెట్టు.
ద్రౌణికము
సం. విణ. (అ.ఈ.అ.). తత్స. ఉప్యతే అస్మిన్నితి వాపః క్షేత్రః ద్రోణస్య వాపః ద్రౌణికః. ఇద్దుము విత్తులు విత్త తగిన పొలము, కుంచెడు విత్తనములు పట్టుమడి.
ద్వంద్వము
సం. నా. వా. అ. న. తత్స. ద్వౌ సహవర్తేతే ద్వంద్వం. రెండును కలిసి ఉండునది, రెండు, రహస్యము, శీతోష్ణాదులు. ద్వయోరిదం, ద్వౌ ద్వౌ చ ద్వంద్వం. ఇద్దరి సంబంధమైనది, స్త్రీ పురుషుల జత, ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధం. ద్వౌ ద్వౌ సహాభివ్యక్తౌ ఇతి ద్వంద్వం. కలహము, రహస్యము.
ద్వయాతిగుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వయం రజస్తమో గుణావతీత్య గచ్ఛంతీతి ద్వయాతిగాః. రజస్తమో గుణములు రెంటిని అతిక్రమించినవారు, రజస్తమోగుణరహితుడు.
ద్వాదశాంగుళము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వాదశ అంగళముల పరిమాణము కలది, జానెడు, వితస్తి.
ద్వాదశాత్ముడు
సం. నా. వా. న్. పుం. తత్స. ద్వాదశ అంగుళయః ప్రమాణమస్య ద్వాదశమంగుళః ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. పన్నెండు విధములైన మూర్తులు కలవాడు, సూర్యుడు.
ద్వాపరము
సం. నా. వా. అ. పుం. తత్స. స్ధాణుర్వా పురుషో వేత్యాది ద్వౌ పక్షౌ పరౌ ప్రధానభూతావస్మిన్నితి ద్వాపరః. స్ధాణువో పురుషుడో అను రెండు పక్షములు దీని యందు ప్రధానము, సందేహము. ద్వౌ పక్షౌ పరౌ యస్యేతి చ ద్వాపరః. కృత త్రేతా యుగముల రెంటికి పరమైనది, ఒక యగము. ద్వయోర్విషయయోః పరస్తత్పరః ఆసక్తః అస్తీతి ద్వాపరః. సందేహము, పాచిక రెండవస్థానమునపడుట.
ద్వారపాలకుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వారం పాలయతీతి ద్వారపాలః. వాకిలిని కాచియుండువాడు, పణిహారి, గొల్ల, ప్రతీహరి.
ద్వారము
సం. నా. వా. అ. న. తత్స. వార్యతే నూతనపురుషో అత్ర ద్వారం. క్రొత్తగా వచ్చిన వారు దీని యందు నివారింపబడతారు, వాకిలి, ఉపాయము. ద్వరతి నిర్గచ్ఛతి గృహాభ్యంతరాదనేనేతి ద్వారం. తలుపు.
ద్వార్ధ్సితుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వారి తిష్ఠతీతి ద్వార్ధ్సితః. ద్వారమందుండువాడు, ద్వారపాలకుడు.
ద్వార్ధ్సుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వారి తిష్ఠతీతి ద్వార్ధ్సః. ద్వారమందుండువాడు, ద్వారపాలకుడు.
ద్విగుణాకృతము
సం. విణ. (అ.ఆ.అ). తత్స. రెండు సార్లు దున్నిన పొలము.
ద్విజ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. ద్విర్జాయతే ద్విజా. రెండు మార్లు పుట్టునది, బారంగి చెట్టు, రేణుక అను గంధ ద్రవ్యము.
ద్విజము
సం. నా. వా. అ. పుం. తత్స. అండరూపేణ పక్షిరూపేణ చ ద్విర్జాయత ఇతి ద్విజః. గుడ్డుగాను, పక్షిగాను రెండు మార్లు పుట్టునది, పక్షి, పాము, పల్లు, అండజము.
ద్విజరాజు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్విజానాం బ్రాహ్మణానాం రాజా ద్విజరాజః. పుడమి వేల్పుల రాజు, చంద్రుడు, గరుత్మంతుడు, శేషుడు.
ద్విజాతి
సం. నా. వా. ఇ. పుం. తత్స. దేహోత్పత్యుపనయనాది లక్షణే ద్వే జాతీ జన్మనీ అస్యేతి ద్విజాతిః. దేహోత్పత్త్యుపనయనాది సంస్తారములనెడు రెండు జన్మములు కలవాడు, పక్షి, పాములోనగునది, బ్రాహ్మణుడు.
ద్విజిహ్వము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వేజిహ్వే అస్యేతి ద్విజిహ్వః. రెండు నాలుకలు కలది, పాము, సర్పము, కొండెములు చెప్పువాడు.
ద్విజుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్విర్జాయంత ఇతి ద్విజాః. రెండుసార్లు పుట్టువారు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, రాజు, క్షత్రియుడు.
ద్వితీయ
సం. నా. వా. ఆ. స్త్రీ. తత్స. యజ్ఞాధికారఫల భాగినోర్జాయా పత్యోరన్యతరత్వేన ద్వితీయా. యజ్ఞాధికారమందు ఫలమును పొందునపుడు పతితో కూడ తాను రెండవది, భార్య, విదియ, పత్ని. సం. విణ. తత్స. రెండవది.
ద్విపము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వాభ్యాం పిబతీతి ద్విపః. తొండము, నోరు రెంటి చేత పానము చేయునది, ఏనుగు, రెంటద్రావుడు. ద్వాభ్యాం ముఖశుండాభ్యాం పిబతీతి ద్విపః. నాగకేశరము.
ద్విపాద్యము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వౌపాదౌ ప్రమాణమస్మిన్నితి ద్విపాద్యః.రెండు భాగములు ప్రమాణముగా కలది, తగిన దండుగ కంటి ఇనుమడి అగు దండుగ, రెట్టింపుశిక్ష.
ద్విరదము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వౌరదావస్య ద్విరదః. రెండు కొమ్ములుకలది, ఏనుగు, ద్విపము. ద్వౌ రదౌ దంతౌ ప్రధానతయా యస్య సః ద్విరదః.
ద్విరసనము
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వే రసనే జిహ్వే యస్య సః ద్విరసనః. సర్పము, పాము.
ద్విరేఫము
సం. నా. వా. అ. పుం. తత్స. అస్య భ్రమర ఇతి నామ్ని ద్వౌరేఫౌ స్త ఇతి ద్విరేఫః. భ్రమరం అను తన పేరు నందు రెండు రేఫములు కలది, తుమ్మెద.
ద్విషత్తు
సం. నా. వా. త్. పుం. తత్స. ద్వేష్టీతి ద్విషత్. ద్వేషించువాడు, శత్రువు, పగవాడు.
ద్విషుడు
సం. నా. వా. ష్. పుం. తత్స. ద్వేష్టితి ద్విషత్. ద్వేషించువాడు, శత్రువు, పగవాడు.
ద్విహాయని
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ద్వౌ హాయనౌ వయః ప్రమాణమస్యా ఇతి ద్విహాయనీ. రెండేండ్లు కలిగినది, పెయ్య.
ద్వీపము
సం. నా. వా. అ. పుం. న. తత్స. ద్విధాగతాః ఆపః అస్మిన్నితి ద్వీపః. దీని యందు జలము రెండు భాగములుగా ఇరు పక్కల ప్రవహించును, దీవి. ద్విర్గతా ద్వయోర్దిశోర్వా గతా ఆపో యత్ర ఇతి ద్వీపః. పులితోలు, సప్తద్వీపములు. 1. జంబు, ప్లక్షము, కుశ, కౌంచ, శాకము, శాల్మలము, పుష్కరములు.
ద్వీపవతి
సం. నా. వా. ఈ. స్త్రీ. తత్స. ద్వీపాః అస్యాం సంతీతి ద్వీపవతీ. ద్వీపములు కలిగినది, నది, ఏరు, భూమి.
ద్వీపి
సం. నా. వా. న్. పుం. తత్స. నివాసత్వేన ద్వీపమన్యేతి ద్వీపీ. ద్వీపం ఉనికి పట్టుగా కలది, పులి, చిరుతపులి, సముద్రము. ద్వాపం కర్వురచర్మ అస్త్యస్యేతి ద్వీపీ. వ్యాఘ్రము.
ద్వేషణుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వేష్టీతి ద్వేషణః. ద్వేషించువాడు, శత్రువు, పగవాడు.
ద్వేషి
సం. విణ. (న్. ఈ. న్.). తత్స. ద్వేష్టి తచ్ఛీలః ఇతి ద్వేషీ. ద్వేషము కలవాడు, శత్రువు.
ద్వేష్యుడు
సం. విణ. తత్స. ద్వేష్టుం యోగ్యో ద్వేష్యః. ద్వేషింపతగినవాడు, పగగొనతగినవాడు, శత్రువు, నిందింపతగినవాడు.
ద్వైధము
సం. నా. వా. అ. న. తత్స. షడ్గుణములలో ఒకటి. (గుణము, ఇది త్రివిధము, బలవంతులగు నిద్దఱు శత్రువుల నడుమనండెడువాడు వారిరువురతో ప్రత్యేకము నీవాఁడనని చెప్పుట, అందొకనితో సంధి చేసి కొనుట, ఒకనితో కలహించుట).
ద్వైపము
సం. విణ. (అ.ఆ.అ.). తత్స. ద్వీపి చర్మముచేత కప్పబడినది (రథము), ద్వీప సంబంధమైనది.
ద్వైమాతురుడు
సం. నా. వా. అ. పుం. తత్స. ద్వయోర్మాత్రోరుమా గంగయోరపత్యం ద్వైమాతురః. గంగా పార్వతులు ఇద్దరికీ కుమారుడు, వినాయకుడు, జరాసంధుడు.
ద్వ్యష్టము
సం. నా. వా. అ. న. తత్స. ద్వేహేమరూప్యే అశ్నుతే ద్వ్యష్టం. వెండి బంగారములను రెంటిని వ్యాపించునది, తామ్రము, రాగి.
ధృఢము
సం. క్రి. విణ. అ. న. తత్స. దృహతీ ధృఢం. ప్రకాశించునట్టిది, అత్యంతము. దృహతీతి ధృఢః. వృద్ధి పొందినవాడు, అధికము, దిటవు కలది, గట్టిది, బలిసినది, కఠినము, ప్రగాఢము, ఇనుము, గడ్డిజాతి, వేరు, పెద్దది, సమృద్ధమైనది, తీవ్రమైనం. అతిశయించినది, లావైనది.
ధైవతము
సం. నా. వా. అ. పుం. న. తత్స. దేవతా ఏవ దైవతాని . దేవతలే ధైవతములు, ఒక స్వరము, వేలుపు.