విజయనిఘంటు చంద్రిక – పరిచయం

(తెలుగు వైద్యుత మహా నిఘంటువు)

ఈ నిఘంటువు వెన్నుదన్ను

వర్తమాన సమాజం లో మహోన్నత మానవతా మూర్తులలో అగ్రగణ్యులు శ్రీ డా. సూరపనేని విజయకుమార్ గారు. భారతీయ సంస్కృతి పట్ల అపారమైన భక్తి, గౌరవం, సంగీత, సాహిత్యాల పట్ల ఎనలేని ప్రీతి, చదువునుంచి వచ్చే సంస్కారం దేశంలో ప్రతి ఒక్కరికీ అందాలనే తపన, మాతృ భూమి పట్ల అమితమైన ఇష్టం, భాషలన్నింటి పట్ల అసమానమైన మన్నన, అన్నింటికన్నా తెలుగు భాష పట్ల గొప్ప అభిమానం, తన ఊరుకు ఏమైనా అయితే తమ ఇంటికే నష్టం వాటిల్లిందనేంత మమేక భావన, ఎంత కలిమి ఉన్నా ఎంతో నిగర్విత - ఇవన్నీ కలిపిన మానవతా మూర్తి శ్రీ విజయకుమార్ గారు. వారు చేసిన గుప్తదానాలు, వారు సమాజానికి చేసిన సేవల వివరాలు లెక్కింపలేనివి.

ఈ నిఘంటువు ఆవిర్భావ నేపథ్యం

వారి మనస్సునుంచి ప్రభవించిన ఒక జ్ఞాన భాండాగారమే ఈ విజయ నిఘంటుచంద్రిక (VNC). ఇది ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న తెలుగువారికి వారు అందస్తున్న ఒక అమృత ఫలం. ఎందరో తెలుగు పండితులు, పరిశోధకులు, విద్యాధికులు, తెలుగు కవులు, సాహితీ, భాషావేత్తలు అందరూ కలిసి పనిచేస్తే ఆవిర్భవించిన తెలుగు పదముల సముద్రం ఈ విజయ నిఘంటు చంద్రిక. ఇది ఒక మహత్తరమైన నిస్వార్థ, బహుళ ప్రయోజన సిద్ధి ప్రదమైన ప్రణాళిక. తెలుగులో మరియు సంస్కృతం లో ఉన్న ప్రసిద్ధనిఘంటువులన్నింటినీ ఒక్కటి చేసి వాటిలో ఉన్న పదములన్నింటికీ ఒక్క స్రోతస్సును ఏర్పరచి అచ్చులుగా, హల్లులుగా విభజించి వాటిని వైద్యుతమాధ్యమంలో పదములను వెదికేందుకు అవసరమైన వ్యవస్థను కల్పించేందుకు 2015 మే నెలలో ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. ఆ ప్రణాళికను అమలు పరిచే బాధ్యత డాక్టర్ రాణి సదాశివ మూర్తి, మరి ఇద్దరు తెలుగు భాషాసాహితీ వేత్తలకు అప్పగించారు శ్రీ యుతులు విజయకుమార్ గారు.

ఒక నిఘంటువు ను నిర్మించడం అంటే అది ఒక సులభమైన విషయం కాదు. కనీసం రెండు దశాబ్దాల పరిశ్రమ కావాలి. కానీ శ్రీయుతులు విజయకుమార్ గారు ఆదేశించారంటే అది శిరోధార్యం అని భావించి రాణి సదాశివమూర్తి తిరుపతిలో జూన్ 7 వ తేదీ 2015 సంవత్సరంలో ఈ నిఘంటువు రూపకల్పనకు శుభారంభం చేయడం జరిగింది. అక్కడి నుండి 31-05-2016 వరకూ నిరాటంకం గా నిఘంటువు ను కూర్చే పని జరిగింది.

ఇది వైద్యుత నిఘంటువు (electronic dictionary) కావడం చేత దీనిలో కొన్ని గవేషణ ప్రమాణాలు ఏర్పరచబడ్డాయి. దాని ప్రకారం ...

1. ఏదైనా ఒక పదాన్ని ఎంచుకుంటే దాని అర్థం తో పాటు –
A) ఆ పదం 1. తత్సమమా? 2. తద్భవమా? 3. దేశ్యమా? 4. అన్యదేశ్యమా? 5. మాండలికమా? 6. గ్రామ్యమా? అనే వివరాలు వస్తాయి.
B) అలాగే ఆ పదము
1. నామవాచకము 2. సర్వ నామము 3.క్రియా పదము 4. విశేషణము 5. క్రియా విశేషణము లలో ఏ భాషా భాగమో తెలుస్తుంది.
C) పదమునకు చెందిన విశేషాలు
ఆ పదము యొక్క ప్రసిద్ధిని బట్టి దానికి ఉన్న అన్ని అర్థములు, పర్యాయపదములు, తెలుగు సాహిత్యంలో లభించినంతవరకు ఉదాహరణలు, వాటితో ఉన్న జాతీయములు వంటివి అన్నీ పొందుపరచడం జరిగింది.


అలాగే ఈ నిఘంటువులో జ్ఞానవర్గ, విజ్ఞానవర్గ, కళావర్గ, సాహిత్యపదవర్గ, వ్యవహారవర్గ, క్రియావర్గ, అవ్యయవర్గ, విదేశభాషావర్గ, వ్యోమవర్గ, ఆధునికపదవర్గ, జంతువర్గ, పక్షివర్గ, సామాన్యవర్గ, వనౌషదివర్గ అని 14 వర్గల ద్వారా పదములను వెతుక వచ్చు.

D) ఈ నిఘంటువుకు ఆధారగ్రంథములు
I. తెలుగు నిఘంటువులు, కోశములు
అ) అమరకోశం
ఆ) శబ్దరత్నాకరము
ఇ) ఆంధ్ర వాచస్పత్యము
ఈ) ప్రాంతీయ మాండలిక పదకోశం
ఉ) సూర్య రాయాంధ్ర నిఘంటువు (8భాగములు)
ఊ) ఓషధి నిఘంటువు
ఋ) అర్థశాస్త్ర పారిభాషిక పదకోశం
ౠ) జంతు శాస్త్ర పారిభాషిక పదకోశం
ఎ) భౌతిక శాస్త్ర పారిభాషిక పదకోశం
ఏ) రసాయన శాస్త్ర పారిభాషిక పదకోశం

II. సంస్కృతగ్రంథములు (తత్సమములకోసం)
అ) అమరకోశము
ఆ) వైజయంతీ కోశము
ఇ) వాచస్పత్యము
ఈ) సంస్కృతాంధ్ర పదార్ణవము
ఉ) నాట్య శాస్త్రము
ఊ) హలాయుధకోశము
ఋ) నానార్థ రత్నమాల
ౠ)శబ్దరత్నాకరము

ఇవి కాకుండా అనేక లఘు నిఘంటువులు (ఏకాక్షర నిఘంటువులు) ఇలా 17 నిఘంటువులు పరిగణనలోకి తీసుకోబడ్డాయి. వీటన్నింటినీ ఒక ప్రవాహంలోకి తీసుకుని రావడం జరిగింది.
E) ఇందులోని మాండలిక పదములు (Dialects) ప్రధానముగా ఈ విధంగా ఉన్నాయి.
1) తెలంగాణ మాండలిక పదములు
2) గుంటూరు మాండలిక పదములు
3) నెల్లూరు మాండలిక పదములు
4) సాధారణ దేశ్యములు (ఇందులో ఇతరప్రాంతముల మాండలికములు కూడా కలిసి ఉన్నాయి.)

F) మరొక ముఖ్యమైన సదుపాయము .. ఎవరైనా పదములనే కాదు.. తెలుగు లేక సంస్కృత భాషలలోని ప్రసిద్ధ నిఘంటువులను చూడాలన్నా ఈ విజయ నిఘంటు చంద్రిక లో ఆ యా గ్రంథములనే చూడవచ్చు. (PDF format)
1. అమరకోశము (Sanskrit & Telugu)
2. సూర్య రాయాంధ్ర నిఘంటువు (6 out of 8 parts)
3. శబ్ద రత్నాకరం (Sanskrit & Telugu)
4. సంస్కృత వాచస్పత్యము 6 భాగములు
5. ఆంధ్ర వాచస్పత్యము 4 భాగములు
6. హలాయుధకోశము
7. వైజయంతీ కోశము

G) ఈ నిఘంటు నిర్మాణంలో సహకారమందించిన పండితులు, పరిశోధకులు, సాహితీవేత్తలు
1. డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి ... రాయలసీమ మాండలికం
2. డా. టి. సత్యనారాయణ, రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, ... తూర్పు గోదావరి జిల్లా మాండలికం
3. డా. రవి, సి.ఆర్. ఆర్. కాలేజి, ఏలూరు ... పశ్చిమ గోదావరి జిల్లా మాండలికం
4. శ్రీ శ్రీ నివాసమూర్తి, ఢిల్లీ ... ఆంధ్ర గిరి,వనసీమలమాండలికాలు
5. గుమ్మా నాగమంజరి, ... విజయనగరం మాండలికం
6 . డా. జానయ్య, నల్గొండ ... నల్గొండ మాండలికం
7 . డా. జె.వి. సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం ... కుప్పం పరిసరాల్లో తెలుగు మాండలికం
8 . చంద్రశేఖర్, తెలంగాణ, ... తెలంగాణా మాండలికం
9 . శ్రీమతి కమలాకర రాజేశ్వరి ... గుంటూరు మాండలికం
10. ములుగు లక్ష్మీమైథిలి. . . నెల్లూరు మాండలికం
11. శ్రీమంతుల దామోదర్ ... వరంగల్, కరీంనగర్ మాండలికం

వీరందరితో విశాఖపట్నం లో ది. 28-10-2017 న వాల్తేరు క్లబ్ లో శ్రీయుత విజయకుమార్ గారి అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహింపబడింది. ఆ సమావేశంలో ఎవరెవరు ఏఏ మాండలికముల పదములను ఇవ్వగలరో అడిగి ఆ ప్రకారం ఆ మాండలికముల సేకరణబాధ్యతను వారికి ఇచ్చేందుకు నిర్ణయం చేయటం జరిగింది. ఆ తరువాత మరొక సంవత్సరమునకు వీరిలో కొందరు ఎక్కువ ఇవ్వగలిగారు. కొందరు అతి తక్కువగా ఇచ్చారు. అలా వచ్చిన అన్ని మాండలిక పదములు కలిసి 6158 పదములు సమకూరినవి.

H) ఇలా అన్ని నిఘంటువుల నుంచి తీసుకున్న పదములు
అచ్చులు - 7588
హల్లులు - 6594
గుంటూరు మాండలికములు - 1752
నెల్లూరు మాండలికములు - 1341
తెలంగాణా మాండలికములు - 638
సాధారణ దేశ్యములు - 2427 (ఇవన్నీకూడా అధికంగా మాండలికములే)
నాట్యవర్గ - 1214
వనౌషదివర్గ - 3910
సింహాదివర్గ - 1601
ఓషధి నిఘంటువు - 1842
అర్థశాస్త్రము - 1382
జంతుశాస్త్రము - 5599
రసాయన శాస్త్రము - 7059
భౌతిక శాస్త్రం - 7422
Total = 50369

ఇంతవరకు జరిగిన కార్యక్రమము పై సమీక్ష
1. అ నుంచి ఔ వరకూ అచ్చులకు చెందిన పదాలు అన్నింటికీ తెలుగు మరియు సంస్కృత నిఘంటువులలోని పదములన్నింటినీ ఒక్క చోటికి చేర్చడం జరిగినది. ప్రూఫ్ లు కూడా తగినంత గట్టిగానే చూశారు.
2. క నుంచి హ వరకు ఉన్న పదములను లభ్యమైన మేరకు తెలుగు మరియు సంస్కృత నిఘంటువులలోని పదములన్నింటినీ ఒక్క చోటికి చేర్చడం జరిగింది. అయితే ఫ్రూఫ్ లను దిద్దినా ఇక పని చేసే నిపుణులు లభించక అక్కడితో పనిని నిలుపు చేయవలసి వచ్చింది.
3. సంస్కృత నిఘంటువులనుండి పదములను కలుపుకొనుటలో ముఖ్యోద్దేశము అధిక సంఖ్యలో విశేష్య రూప తత్సమములను కలుపుటకు ఉన్న సౌకర్యమును బట్టి పదములను వృద్ధి పరచుటయే.
ఇంతవరకూ చేసింది లోకార్పణానికి తగినట్టుగా ఉండటం చేత ఈ ప్రయత్నం ద్వారా తెలుగు ప్రపంచానికి అందజేస్తున్నాము.
ఈ కార్యక్రమం లో తిరుపతి లో జూన్ 2015 లో ప్రారంభించిన కార్యాలయం లో 11 మాసముల పాటు పనిచేసిన వారు:
ఈ మొత్తం కార్యక్రమానికి Electronic Hyper Text రచన కోసం Chief Computer Programmer : Dr. K. Sujani, System Analyst, National Sanskrit University, Tirupati

ఇతర నిపుణులు
1. డా. నారాయణ నంపియాతిరి – రీసర్చ్ అసోసియేట్
2. డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ - రీసర్చ్ అసోసియేట్
3. డా. సుజాత మునుకుట్ల (లేట్) - రీసర్చ్ అసోసియేట్
4. టి. ఎ. విశాలాక్షి - డి. టి. పి. ఆపరేటర్
5. టి. మోహన్ బాబు - డి. టి. పి. ఆపరేటర్
6. సిహెచ్ . సాయి సంతోష్ - డి. టి. పి. ఆపరేటర్
7. లంక మల్లికార్జున ప్రసాదు - డి. టి. పి. ఆపరేటర్
8. శ్రీమతి హరిప్రియ - డి. టి. పి. ఆపరేటర్
ఇందరు పండితులు, భాషావేత్తలు, సాహితీ వేత్తలు, తెలుగు అభిమానులు, తెలుగు కవులు, తెలుగులో పట్టభద్రులు కలిస్తే ఈ విజయ నిఘంటు చంద్రిక రూపు దాల్చింది.

పర్యవేక్షణ : డా. రాణి సదాశివ మూర్తి

ఈ నిఘంటువు లోకోపకారకం కావాలని అందరికీ ప్రయోజనకారి కావాలని కోరుకుంటున్నాము.

ఒక ముఖ్య గమనిక

ఈ నిఘంటు పరియోజన 2015 లో ప్రారంభమై 11 మాసాలలో తగు రూపురేఖలను సంతరించుకున్నది. దీన్ని వైద్యుత నిఘంటువు గా రూపొందించడంలో ఆనాటికి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అప్పటికి చాలా వాడుకలో ఉన్న ఫాంట్స్ ను ఉపయోగించి ఈ నిఘంటువును సిద్ధపరిచాము. అయితే ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని పొందుతూ మారుతున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ పది సంవత్సరాలలో ఆనాటి ప్రణాళిక, ఆ ఫాంట్స్, ఆ రచన అవన్నీ... నేటి యాంత్రిక వ్యవస్థ స్వీకరించడానికి యోగ్యం కాని రీతిలో మార్పు చెందాయి. వాటినన్నింటినీ ఎంతో ఓర్పు తో, నేర్పుతో నేటి సాంకేతికతకు సరిపడే విధంగా వృద్ధి పరిచింది డా. సుజని.
ఇంచుమించుగా మార్పులన్నీ సరిచెయ్యడం జరిగాయి. ఇంకా దోషాలు సంభవించితే అది సాంకేతిక సంవాదం లేకనే అని గ్రహించగలరని ప్రార్థన.
అలాగే ఎక్కడైనా ఎవరికైనా సరిదిద్దవలసిన అంశాలు కనబడితే... ఈ క్రింది ఈ మెయిల్ ద్వారా ఆ అంశాలను పంపితే వెబ్సైట్ అడ్మిన్ లు వాటిని సరిచేసే ఏర్పాటు చేస్తారు

contact@vijayanighantu.com