ఆవిష్కరణ సభకు చెందిన ఛాయా చిత్రాలు
మన జీవన విధానానికి ఆయువుపట్టు మాతృభాషే
తెలుగు భాష పట్ల పిల్లలకు అనురక్తి పెంచాలి
అందుకు అవసరమైతే బోధన పద్ధతులు మార్చుకోవాలి
భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు
విజయనిఘంటు చంద్రిక ఆవిష్కరణ
తెలుగు భాష పట్ల పిల్లల అనురక్తి పెరిగే విధంగా, వారి అభిరుచులకు అనుగుణంగా నూతన బోధన పద్ధతులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయనిఘంటు చంద్రిక పేరుతో తీసుకువచ్చిన వైద్యుత నిఘంటువు( ఈ- డిక్షనరీ)ను శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరాలకు మాతృభాషను మరింత చేరువ చేసేందుకు తెలుగు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు మరిన్ని పద్ధతుల గురించి ఆలోచించాల్సిన అవసరం అవసరం ఉందన్నారు. " తెలుగు భాషను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభినందనీయం. అదే సమయంలో తెలుగు భాషకు సంబంధించిన పరిశోధనల మీద కూడా దృష్టి పెట్టాలి. కాలం మారుతోంది, అలవాట్లు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి... ఇలాంటి పరిస్థితుల్లో బోధన విధానాల్లో కూడా మార్పు రావలసిన అవసరం ఉంది." అని స్పష్టం చేశారు.
"విజయ నిఘంటు చంద్రిక.... భాషలో పదాల అర్ధాలు తెలుసుకోవటానికి ఓ మంచి అవకాశం అని నా అభిప్రాయం, ఇప్పటికే ఆంధ్రభారతి రూపంలో ఓ వైద్యుత నిఘంటువు అందుబాటులో ఉంది. ఇప్పుడు విజయ నిఘంటు చంద్రిక చొరవ మరింత విస్తృతమైందని భావిస్తున్నాను. ఇవన్నీ పదాలకు అర్థాలు తెలియజేస్తున్నాయి. బాగానే ఉంది. అయితే తెలుగు భాష పట్ల పిల్లల అనురక్తి పెరిగే విధంగా, వారి అభిరుచులకు అనుగుణంగా నూతన బోధన పద్ధతులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది." అన్నారు. "మన జీవన విధానంలో ఆయువు పట్టులాంటిది మన మాతృభాష. ఒకప్పుడు మన పద్యం, గద్యం జగద్విదితం. దానిని మరల దశదిశల వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరకు మన తిట్టు సహా సంప్రదాయాలను పునరుజ్జీవింపజేయాలి.
భాష మనుగడకు వాడుకే జీవగర్ర. అన్ని భాషల్లాగే తెలుగుకూ వివిధ స్థాయి ప్రయోజనాలున్నాయి. నవతరం బడి పిల్లలు, ఉత్సాహం ఉప్పొంగే యువతరం, భావి తరాల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు, భాష పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు, దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు... భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. తెలుగు వారు మేల్కొని మన భాషా సాహిత్య, సంస్కృతీ పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయకపోతే అమూల్యమైన తెలుగు భాష క్షీణించే దశ మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఒక భాష ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ ఉన్న వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా క్రమంగా తెరమరుగవుతాయి. వ్రేళ్లకు చెదలు పట్టినప్పుడు మహావృక్షమైనా కూలిపోక తప్పదు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటినుంచే జాగ్రత్త వహించాలి. ఏ పని అయినా అందరూ కలిసి కట్టుగా చేయకపోతే దాన్ని సాధించలేం. తెలుగు పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది." అని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో బుధవారం (10-07-2024) జరిగిన కార్యక్రమంలో విజయనిఘంటు చంద్రిక వైద్యుత నిఘంటువును నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ఈ నిఘంటువుకు అంకురార్పణ చేసిన శ్రీ విజయకుమార్ గారికి, సిద్ధపరచిన శ్రీ రాణీసదాశివ మూర్తి గారి బృందానికి నా అభినందనలు. భాష ఓ సహజ సిద్ధమైన ప్రవాహం వంటిది. భాషకు సంబంధించి చేసిన ఓ ప్రయత్నం అక్కడితో ఆగిపోకూడదు. ఈ వైద్యుత నిఘంటువు ఇక్కడితో ఆగిపోరాదు.
విజయనిఘంటు చంద్రిక బృందం వీలైనన్ని పాఠశాలలు తిరిగి, ఈ నిఘంటువును వారికి చూపించి, వారి సందేహాల ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తే బాగుంటుంది. పదసంపదను మరింతగా పెంచుకుంటూ... తెలుగును ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో పరిశోధించి ఆ మార్గంలోనూ అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.
ఈ విజయ నిఘంటు చంద్రిక... తెలుగు భాషకు నిఘంటు రూపకర్తలు ఇస్తున్న ఒక గౌరవ సూచిక. అందుకు వారికి మరోసారి అభినందనలు. మన జీవన విధానంలో ఆయువు పట్టులాంటిది మన మాతృభాష. మన తెలుగును మనం కాపాడుకోవాలి. భావి తరాల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు, భాష పునాదులకు పాదులు కట్టాల్సిన ఉపాధ్యాయులు, దాన్ని పెంచి పోషించాల్సిన విద్యా సంస్థలు... భాషా పరిరక్షణపై శ్రద్ధ పెంచాలి. మన తెలుగు కుటుంబాలు ప్రపంచంలో ఎక్కడున్నా ముందుగా తెలుగును తమ ఇంటా వంటా అలవర్చుకోవాలి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. తమ పిల్లలను తెలుగు సంస్కృతిలో భాగం చేయాలి.
అని మాస్యశ్రీ ముప్పవరపు వెంటయ్యనాయుడు గారు కొనియాడారు.